శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 28 ఆగస్టు 2015 (16:14 IST)

ఏపీకి ప్రత్యేక హోదాపై బహిరంగ చర్చకు సిద్ధమే: రఘువీరా రెడ్డి

ప్రధానికి ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన వినతిపత్రంలో ఏముందో తనకు తెలియదని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చెప్పారని, చంద్రబాబు రహస్య పాలనకు ఇది అద్దం పడుతోందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై బహిరంగ చర్చకు సిద్ధమని చంద్రబాబు విసిరిన సవాల్‌కు తాను సిద్ధమన్నారు. ప్లేస్, డేట్, టైమ్ చంద్రబాబే డిసైడ్ చేయాలని తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రాన్ని స్మార్ట్ సిటీ చేస్తామని చెప్పిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇప్పుడు రాష్ట్రానికి మూడు స్మార్ట్ సిటీలే రావడంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
 
మరోవైపు రాష్ట్ర సమస్యలపై  బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ సీఎం చంద్రబాబు నాయుడు విసిరిన సవాల్‌కు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా స్పందించారు. బహిరంగ చర్చకు తాను సిద్ధమేనని ప్రకటించిన ఉండవల్లి, చర్చలో తనకూ అవకాశం కల్పించాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనలో చంద్రబాబు విఫలమయ్యారంటూ విపక్షాలు విరుచుకుపడ్డాయి. ఈ క్రమంలో ఉండవల్లి కాస్త ఘాటైన వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సమస్యలపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని చంద్రబాబు నిన్న విపక్షాలకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.