శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: మంగళవారం, 18 ఆగస్టు 2020 (19:58 IST)

తెలుగు రాష్ట్రాలకు తప్పని వాన గండం, మరో మూడురోజుల పాటు వర్ష సూచన

తెలుగు రాష్ట్రాలకు వాన గండం తప్పేలా లేదు. గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలలో వర్షాలు తీవ్ర స్థాయిలో కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉదృతంగా ప్రవహిస్తున్నది. మూడో హెచ్చరిక ప్రమాద స్థాయిని దాటి గోదావరి ప్రవహిస్తున్నది. భారీ వర్షాలతో ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలు కూడా బాగా దెబ్బతిన్నాయి.
 
పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చునని హైదరాబాదు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈశాన్య మధ్యప్రదేశ్, ఉత్తర చత్తీస్ గడ్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతుందని దీనికి అనుగుణంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ శాక అధికారులు పేర్కొన్నారు.
 
వచ్చే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఈ అల్పపీడనం ప్రయాణించి బలహీనపడే అవకాశముందని, ఆ ప్రభావంతో వర్షాలకు అవకాశముందని అధికారులు తెలిపారు. మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో రేపు అల్ప పీడనం ఏర్పడే అవకాశమున్నట్లు తెలుస్తుంది. దీని ప్రభావం వలన తెలుగు రాష్ట్రాలలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.