శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 28 జూన్ 2020 (11:18 IST)

ఏపీలో రేషన్ చక్కెర, కందిపప్పు ధ‌ర‌లు పెంపు

లాక్ డౌన్ తో అల్లాడిపోతున్న జనాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు.. తమదైన శైలిలో దొంగదెబ్బ తీస్తున్నాయి. ఇష్టానుసారంగా వివిధ మార్గాల్లో ధరలు పెంచేస్తున్నాయి. ఇందులో ఏపీ ప్రభుత్వం ముందువరుసలో వుంది.

ఇప్పటికే కరెంటు చార్జీలు పెంచి సామాన్య ప్రజానీకానికి వాతలు పెట్టిన జగన్ ప్రభుత్వం.. తాజాగా రేషన్ లో అందించే చక్కెర, కందిపప్పు ధరల్ని పెంచింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చౌక ధరల దుకాణాలు ద్వారా పంపిణీ చేసే చక్కెర, కందిపప్పు ధ‌ర‌లు పెరిగాయి. అంత్యోద‌య అన్న యోజన కార్డుదారులకు మాత్రం చక్కెర ధ‌ర‌లు యధాతథంగా ఉంది.

సాధారణ తెల్ల రేషన్ కార్డుదారులకు మాత్రం ఇక‌పై పెరిగిన ధ‌ర‌లు వర్తించనున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు రూ.40 ఉన్న కందిపప్పు ధ‌ర‌ను రూ.67కి, అలాగే అరకిలో చెక్కర రూ.10 ఉండగా ప్రస్తుతం ఆ ధరను రూ.17కి పెంచుతూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.
 
రేషన్ సరుకుల ధరల పెంపు పేదలను దోచుకోవడమే: టీడీపీ మహిళాధ్యక్షురాలు వంగలపూడి అనిత
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత పౌర సరఫరాల వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారు. పనికిమాలిన నిబంధనలతో దాదాపు 19 లక్షల రేషన్ కార్డుల్ని తొలగించి పేదలకు రేషన్ సరుకులు అందకుండా చేశారు. గతంలో ఆరేడు రకాల సరుకులు అందితే.. జగన్ ప్రభుత్వం బియ్యం, పంచదార, కందిపప్పుకు పరిమితం చే సింది.

ఇప్పుడు తెల్లరేషన్ కార్డుదారులకు అందించే సరకుల ధరలు కూడా పెంచి పేద మధ్యతరగతి ప్రజల్ని వంచిస్తోంది. జగన్ రెడ్డి ప్రభుత్వంలో రైతు పండించే వరి మొదలు కందిపప్పు, ఆవ గింజల వరకు దేనికీ గిట్టుబాటు ధర లేదు. కానీ రేషన్ షాపుల్లో, ఇతర షాపుల్లో ధరలు  మాత్రం భగ్గుమంటున్నాయి.

నిత్యావసర సరుకులు ధరలు అదుపులో ఉంచేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని ప్రకటనలు చేయడమే తప్ప.. క్షేత్రస్థాయిలో చేసిందేమీ లేదని రేషన్ సరుకుల దరల పెంపు, బహిరంగ మార్కెట్లో భగ్గుమంటున్న ధరలు చూస్తే అర్ధమవుతోంది. జగన్మోహన్ రెడ్డికి అటు రైతులూ పట్టరు. ఇటు పేద మధ్యతరగతి ప్రజలూ పట్టరు. ఏ ప్రభుత్వమైనా రైతులు బాగుండేలా మద్దతు ధరలు ప్రకటిస్తుంది.

ప్రజలు బాగుండేలా నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా చూసుకుంటుంది. కానీ.. జగన్ రెడ్డి మాత్రం రైతుల నుండి సరుకులు కొనుగోలు చేసి వ్యాపారం చేసే దళారులకు అండగా నిలిచేలా వ్యవహరిస్తోంది. ఇలాంటి వ్యవస్థ ఉన్నందుకు పాలకులు సిగ్గుపడాలి.

రేషన్ షాపుల్లో పంపిణీ చేసే వస్తువులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. అలాంటి సమయంలో సరుకుల ధరలు పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది.? ప్రభుత్వ ప్రచార ఆర్భాటం కోసం ఐదు, పది, 25కిలోల చొప్పున సంచుల తయారీకే ఏడాదికి రూ.750 కోట్లు చేస్తున్నారు. రేషన్ షాపుల్లో అందే సరుకుల్ని వాలంటీర్ల ద్వారా అందించేందుకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు.

ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయడం కోసం సుమారు రూ.3వేల కోట్లు ఖర్చు చేశారు. ఇలాంటి దుబారా ఖర్చును రేషన్ దుకాణాల్లో అందించే సరుకుల ధరలు పెంచి రికవరీ చేసుకోవాలనే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గం. నిన్నటి వరకు ఇసుక, సిమెంటు, మధ్యం ధరలు పెంచి సామాన్యులను దోచుకున్నారు.

కరోనాతో ఉపాధి లేక, ఆదాయం లేక అవస్థలు పడుతున్న పేదలకు రేషన్ షాపుల ద్వారా ఇచ్చే సరుకుల ధరలూ పెంచడమంటే వారి పొట్టకొట్టేందుకు సిద్ధమవడమే. ఇప్పటికైనా ధరల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి.

కోవిడ్ పై ఆదర్శంగా నిలవడం గురించి ఎమ్మెల్యే రోజా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. కరోనా విస్తరిస్తున్న సమయంలో పూలు చల్లించుకోవడం ఆదర్శమా.? శంకుస్థాపన, ప్రారంభోత్సవాల కోసం వందల మందిని వెనకేసుకెళ్లడం ఆదర్శమా.? కరోనా కిట్లలోనూ కుంభకోణానికి పాల్పడడం ఆదర్శమా.? బ్లీచింగ్ పేరుతో సున్నం, మైదా చల్లడంలో ఆదర్శమా.? ఏ విషయంలో జగన్ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలి.?

అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా రూపాయి ఆదాయం రప్పించలేక.. చంద్రబాబు అప్పులు చేశారని చెప్పుకోవడానికి ఎమ్మెల్యే రోజా సిగ్గుపడాలి. ఇసుక నిలిపేసి భవన నిర్మాణరంగం, కూలీలు అవస్థల్లోకి నెట్టడం ఆదుకోవడమా.? కరోనాతో ఆదాయంలేక ఇబ్బందులు పడుతున్న పేదలపై పెట్రోల్, డీజిల్, చివరకు రేషన్ సరుకుల ధరలు పెంచడం ఆదుకోవడమా?

ఆకలితో అలమటిస్తున్నవారి కడుపు నింపే అన్న క్యాంటీన్లను ఒక్క జీవోతో మూసేయడం ఆదర్శమా? ఏ విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఆదుకున్నారో రోజా రెడ్డి సమాధానం చెప్పాలి. చంద్రబాబు హైదరాబాద్ లో ఉన్నారంటున్న.. రోజా రెడ్డి రాష్ట్రంలో అధికారంలో ఉన్నది మీ ప్రభుత్వమేనని గుర్తుంచుకోవాలి.