శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (12:28 IST)

నేటి నుంచి యధావిధిగా రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌.. 17 బోగీలతో...

విజయవాడ నుంచి విశాఖపట్నం మధ్య నడిచే రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు సోమవారం నుంచి యధావిధిగా నడవనుంది. కాపుగర్జనలో భాగంగా తునిలో ఆందోళనకారుల విధ్వంసంలో రైలు మొత్తం తగలబడిపోవడంతో కొద్దిరోజులుగా దీన్ని నిలిపివేశారు. బోగీల కొరత కారణంగా ప్రస్తుతం 17 బోగీలతోనే నడపనున్నారు. 
 
ఇందులో 8 రిజర్వుడ్‌, 4 సాధారణ, 2 ఏసీ చైర్‌కార్లు, ప్యాంట్రీకార్‌, రెండు ఎస్‌ఎల్‌ఆర్‌లు ఉంటాయి. మరికొద్ది రోజుల్లోనే మిగతా బోగీలు (మొత్తం 24) కూడా ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటించారు. రెండు రోజుల క్రితం విజయవాడ చేరుకున్న ఈ రైలు బోగీలను అధికారులు, సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించి విజయవంతంగా ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. 
 
మరోవైపు... చెన్నై-అహ్మదాబాద్‌ల మధ్య రాకపోకలు సాగించే నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో సోమవారం నుంచి ఆగనుంది. చెన్నై నుంచి అహ్మదాబాద్‌ వెళ్లే రైలు ఉదయం 10.48 నిమిషాలకు, తిరుగు ప్రయాణంలో చెన్నైకి వచ్చే రైలు మధ్యాహ్నం 2.23 గంటలకు సూళ్లూరుపేటలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌ కుమార్‌ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడ-చెన్నైల మధ్య తిరిగే పినాకిని ఎక్స్‌ప్రెస్‌ ఇదే జిల్లాలోని నాయుడుపేటలో ఆపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఇది ఆరు నెలల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.