1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Updated : శుక్రవారం, 9 సెప్టెంబరు 2016 (11:11 IST)

సీమాంధ్రకు సంగతి సరే.. మరి రాయలసీమ గతి ఏమిటి?

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని, ప్యాకేజీ మాత్రమే ఇస్తామని కేంద్ర ప్రభుత్వం తేల్చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు ప్యాకేజీని అంగీకరించడానికి సిద్ధమైపోయింది. అయితే రాయలసీమకు ఇస్తామన్న ప్రత

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని, ప్యాకేజీ మాత్రమే ఇస్తామని కేంద్ర ప్రభుత్వం తేల్చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు ప్యాకేజీని అంగీకరించడానికి సిద్ధమైపోయింది. అయితే రాయలసీమకు ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజీ గురించి పట్టించుకున్న వారు లేరు. అసలు సీమకు ప్రత్యేక ప్యాకేజీ వస్తుందంటూ రాష్ట్రానికి ఇచ్చే ప్యాకేజీలో అదీ కొట్టుకపోతుందా అనేది ఇప్పుడు సీమ ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది.
 
రాష్ట్ర విభజన చట్టంలో రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని స్పష్టంగా ప్రకటించారు. వెనుకబడిన ఏడు జిల్లాలకు రూ.24 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది. దీని ప్రకారం రాయలసీమలోని నాలుగు జిల్లాలకు రూ.14 వేల కోట్లు దాకా వచ్చింది. ఈ నిధులు వస్తే సీమలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి మౌళిక సదుపాయాలు కల్పించడానికి వీలవుతుంది. 
 
ఇప్పటిదాకా కేంద్రం రూ.400 కోట్లు మాత్రమే రాయలసీమకు ఇచ్చింది. ఇంకా రెండున్నర సంవత్సరాల సమయం మాత్రమే మిగిలి ఉంది. అయితే ఇప్పడు రాష్ట్రానికి ఇస్తామంటున్న ప్యాకేజీలో ఏడు వెనుకబడిన జిల్లాలకు కలిపి రూ.2 వేల కోట్లు మాత్రమే ఇస్తారని చెబుతున్నారు. అంటే ఒక్కో వెనుకబడిన జిల్లాకు రూ.300 కోట్లు మాత్రమే ఇస్తారన్నమాట. ఈ లెక్కన సీమకు దక్కబోయేది రూ.1200 కోట్లు మాత్రమే. ఇప్పటిదాకా వచ్చింది దానితో కలిపితో మొత్తం రూ.1600 కోట్లు అవుతుంది. ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకపోవడం వల్ల సీమ మొత్తం రూ.12 వేల కోట్ల దాకా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది.
 
ఇంత అన్యాయం జరుగుతున్నా అసలు విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్న వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీని కేంద్రం పూర్తిగా విస్మరిస్తున్నా ఎవరూ ప్రశ్నించడం లేదు. అసలు ఈ ప్యాకేజీ గురించే గుర్తులేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. చట్టంలో లేని ప్రత్యేక హోదా గురించి అడుగున్నంత గట్టిగా చట్టంలో ఉన్న ప్రత్యేక ప్యాకేజీ గురించి అధికార తెలుగుదేశం పార్టీ కూడా కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదు. రాష్ట్రానికి కేంద్రం రూ.1.50 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినా అందులో రాయలసీమకు ఎంత దక్కుతుందో చెప్పలేం. 
 
ఆ నిధుల్లో సీమ కోసం ఖర్చు చేయకున్నా సీమవాసులు ప్రశ్నించలేరు. అదే సీమకు ప్రత్యేక ప్యాకేజీ పేరుతో నిధులు కేటాయిస్తే ఆ నిధులైనా ఈ ప్రాంతంలో ఖర్చు చేయమని గట్టిగా నిలదీసే అవకాశం ఉంటుది. అయితే కేంద్రంతో చర్చల్లో మాటమాత్రంగానైనా సీమకు ప్రత్యేక ప్యాకేజీ చర్చలకు వచ్చినట్లు కనిపించలేదు. రాష్ట్రానికి ఇచ్చే ప్యాకేజీతో నిమిత్తం లేకుండా సీమకు ప్రత్యేక ప్యాకేజీ కోసం చట్టంలో పేర్కొన్న మేరకు నిధులు సాధించుకోవడం కోసం ఈ ప్రాంత ప్రజలు ఉద్యమించాల్సిన అవసరం ఉంది. లేకుంటే సీమ మరోసారి అన్యాయమైపోతుంది.