మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (07:30 IST)

ఎయిడెడ్ విద్యా సంస్థల పనితీరు మెరుగుకే సంస్కరణలు: విద్యా మంత్రి ఆదిమూలపు సురేష్

రాష్ట్రంలోని పలు ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాల పనితీరును మెరుగపర్చే లక్ష్యంతోనే పలు సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. విద్యార్థులకు, ఎయిడెడ్ ఉద్యోగులకు నష్టం జరిగే విధంగా  ఏ ఒక్క ఎయిడెడ్ విద్యా సంస్థను మూసివేయడం జరుగదని, ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆయన అన్నారు.

కాంట్రాక్టు లెక్చరర్ల భద్రతకు, వారి పరిస్థితి మెరుగు పర్చేందుకు త్వరలో తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని  పేర్కొన్నారు. అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో ఉన్నత విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర్ర, కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, పాఠశాల విద్యా డైరెక్టర్ చినవీరభద్రుడు, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి తదితరులతో కలసి ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. 

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన నాటి నుండి విద్యా రంగంలో పలు సంస్కరణలు తీసుకు వచ్చేందుకు మనబడి నాడు-నేడు, జగన్న విద్యా కానుక, జగన్న విద్యా దీవెన, జగనన్న గోరుముద్దలు వంటి  పలు వినూత్న పథకాలను పెద్ద ఎత్తున అమలు చేయడం జరుగుచున్నదన్నారు.

అయితే ఎన్ని వినూత్న పథకాలు అమలు చేస్తున్నప్పటికీ, గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా కోట్లాది రూపాయలు అందజేస్తున్నప్పటికీ ఎయిడెడ్ విద్యా సంస్థల పనితీరు మెరుగు పడలేదని, విద్యా ప్రమాణాలు రాను రాను దిగజారుతున్నట్లు  ప్రభుత్వం గుర్తించడం జరిగిందన్నారు. 

ఎయిడెడ్ విద్యా  సంస్థల పనితీరును అద్యయనం చేసేందుకు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ ఆచార్య రత్నకుమారి అద్యక్షతన ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని నియమిస్తూ జి.ఓ. 52 ను ప్రభుత్వం జారీచేసినట్లు మంత్రి తెలిపారు. ఎయిడెడ్ విద్యా సంస్థల పనితీరుపై  ఆ కమిటీ  సమగ్రంగా అద్యయనం చేసి ఈ ఏడాది ఏప్రిల్ 22 న ఒక సమగ్ర నివేదిక ను ఆ కమిటీ ప్రభుత్వానికి అందజేయడం జరిగిందన్నారు.

ఆ నివేదికను కేబినెట్ ఆమోదిస్తూ మూడు రకాల ఛాయిస్ లను ఎయిడెడ్ విద్యా సంస్థలకు కల్పిస్తూ ఉన్నత పాఠశాలలకు సంబందించి జి.ఓ.50 ను, జూనియర్ కళాశాలలకు జిఓ.51ను మరియు డిగ్రీ కళాశాలలకు సంబందించి  జిఓ.42 ను ప్రభుత్వం జారీచేసిందన్నారు. ఈ ఉత్తరువుల ప్రకారం గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉప సంహరణ లేదా ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించడం లేదా స్వయంగా నడుపుకునే అవకాశాన్ని ఎయిడెడ్ విద్యా సంస్థలకు కల్పిండం జరిగిందన్నారు.

ఈ షరతులకు లోబడి  137 ఎయిఢెడ్ డిగ్రీ కళాశాలలో 125 డిగ్రీ కళాశాలు, 122 జూనియర్ కళాశాలల్లో 103 జూనియర్ కళాశాలలు, 2000 పైచిలుకు  ఎయిడెడ్ పాఠశాలల్లో 1,276  పాఠశాలలు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉపసంహణకు ఆమోదం  తెలిపాయన్నారు.

అదే విధంగా ఐదు నుండి ఏడు డిగ్రీ కళాశాలు, ఐదు జూనియర్ కళాశాలలు మరియు 100 ఎయిడెడ్ పాఠశాలలకు చెందిన యాజమాన్యం ఆయా విద్యా సంస్థలను ఆస్తులతో పాటు ఉద్యోగులను ప్రభుత్వానికి అప్పగించేందుకు సంసిద్దతను వ్యక్తం చేయడం జరిగిందన్నారు.

ఆయా ఎయిడెడ్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు స్థానికంగా ఉన్న సంబందిత శాఖ అధికారులకు రిపోర్టు చేయాలని జారీచేసిన ఆదేశాల మేరకు ఇప్పటికే డిగ్రీ కళాశాలలకు చెందిన 800 మంది టీచింగ్ స్టాప్, 837 మంది నాన్ టీచింగ్ స్టాప్, జూనియర్ కళాశాలలకు చెందిన 332 టీచింగ్ స్టాప్, 531 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ మరియు సుమారు ఆరు వేల మంది ఎయిడెడ్ ఉపాద్యాయులు రిపోర్టు చేసిట్లు మంత్రి తెలిపారు.

వీరందరికీ పాదర్శకంగా పోస్టింగ్ లు ఇచ్చేందుకు వెబ్ పోర్టల్ ద్వారా వీరి వివరాలు నమోదు చేయడం జరుగుచున్నదని,  డిగ్రీ కళాశాల లెక్చరర్ల జనరల్ ట్రాన్సఫర్ ప్రక్రియ   ముగిసిన వెంటనే వీరికి పోస్టింగ్ లు ఇస్తామని ఆయన తెలిపారు. వీరిలో చాలా మంది మున్సిఫల్ పరిదిలో పనిచేస్తున్నారని, వారికి అదే పరిధిలో పోస్టింగులు ఇవ్వాలని కోరుకుంటున్నారన్నారు, అవకాశం మేరకు అందరికీ న్యాయం చేస్తామని మంత్రి తెలిపారు. 

అదే విధంగా గత 20 సంవత్సరాల నుండి పలు డగ్రీ కళాశాలల్లో సుమారు 700 మంది జూనియర్ కళాశాలల్లో సుమారు 4 వేల మంది కాంట్రాక్టు లెక్చరర్లుగా పనిచేస్తున్నారని, వారికి భద్రత కల్పించేందుకు, పరిస్థతి మెరుగు పర్చేందుకు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తదుపరి పలు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.

ఇందుకు గ్రూప్ ఆఫ్ మినిష్టర్లను మరియు ఛీప్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక వర్కింగ్ కమిటీని కూడా ఇప్పటికే ప్రభుత్వం నియమించిందని, అయితే కోవిడ్ నేపథ్యంలో ఆప్రక్రియ కొంత మందగించిందని, ఆ ప్రక్రియను వేగవంతంచేసి త్వరలో వారికి కూడా న్యాయం చేసేందుకు  తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు.