శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 19 జూన్ 2021 (22:23 IST)

విభిన్న ప్రతిభావంతుల కోసం వెయ్యికి పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విభిన్న ప్రతిభావంతుల కోసం వెయ్యికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విప్లవంలో సిఎం వై.యస్. జగన్ మోహన్ రెడ్డి విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌ను అనుసరించి విభిన్నప్రతిభావంతుల కొరకు వివిధ శాఖలలో నిర్దేశించిన ఖాళీలను భర్తీ చేయనున్నామన్నారు.
 
వైద్య ఆరోగ్యం, పాఠశాల, కళాశాల విద్య, వెనుకబడిన తరగతుల సంక్షేమం తదితర శాఖలలో 668 బ్యాక్ లాగ్ ఉద్యోగాలు గుర్తించి వాటి భర్తీకి క్యాలెండర్ లో నిర్దేశించిన విధంగా చర్యలు తీసుకుంటున్నామని డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు.  వాటిలో ఎపిపిఎస్సి ద్వారా 62 ఖాళీలు, శాఖాదిపతుల ద్వారా 239 ఖాళీలు, డిఎస్సి ద్వారా 178 ఖాళీలు, ఉపాధ్యాయుల డిఎస్సి ద్వారా 189 ఖాళీల భర్తీ కొరకు అతి తర్వలో నోటిఫికేషన్ విడుదల చేయటం జరుగుతుందన్నారు.
 
వాస్తవానికి 2019 జూన్ నెల నుండి ఇప్పటి వరకు 629 ఖాళీలు భర్తీకి చర్యలు తీసుకున్నామని వీటిలో ఎపిపిఎస్ సి ద్వారా 106 ఖాళీలు, డిఎస్ సి ద్వారా 523 ఖాళీలను భర్తీ చేయుటకు నోటిఫికేషన్స్ ఇప్పటికే విడుదల అయ్యాయన్నారు. వీటిలో ఎపిపిఎస్సి ద్వారా 45 ఖాళీలు భర్తీ చేయగా 61 ఖాళీలు భర్తీ ప్రక్రియలో ఉన్నాయన్నారు. మరోవైపు డిఎస్సి ద్వారా 137 ఖాళీలు భర్తీ చేయగా 386 ఖాళీల భర్తీ ప్రక్రియ వివిధ దశలలో ఉందన్నారు.
 
ఈ క్రమంలో మొత్తంగా విభిన్నప్రతిభావంతులు కోసం వెయ్యికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చినట్లు అయ్యిందన్నారు. రాష్ట్రంలోని అర్హత కలిగిన విభిన్నప్రతిభావంతులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కల్పించిన ఈ  అవకాశాన్ని సద్వినియోగ పరుచుకుని స్దిరపడాలని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా వివరించారు.