గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 28 జనవరి 2020 (07:39 IST)

క్రియాశీలకంగా పని చేసేవారికి బాధ్యతలు: పవన్

దేశ సమగ్రత, ప్రయోజనాలకు అవసరమయ్యే భావజాలం మన పార్టీకి ఉందన్న విశ్వాసంతోనే మనతో కలిసి నడవాలని భారతీయ జనతా పార్టీ పొత్తుపెట్టు కొందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. భవిష్యత్తు ఉన్న పార్టీ అని నమ్మింది అన్నారు.

యువత నమ్మకం, ఆడపడుచుల దీవెనలతో పార్టీ భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న రెండు పార్టీలను కాదని మనతో కలిసి నడవాలనుకున్నారంటే మనకు ప్రజల్లో ఎంతో బలముందో తెలుసుకోవాలని అన్నారు. మంగళగిరిలోని జనసేన  పార్టీ కార్యాలయంలో ఒంగోలు నియోజకవర్గ క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.

పార్టీ కార్యకర్తలందరినీ ఆత్మీయంగా పలుకరించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ఒంగోలు అంటే నాకు ప్రత్యేక అభిమానం. ఆ ప్రాంతంలో పెరిగాను. కనిగిరి చుట్టుపక్కల ప్రాంతాలు బాగా తెలుసు. పోరాటయాత్రలో భాగంగా ఒంగోలు వస్తే అపూర్వ స్వాగతం లభించింది. 

దశాబ్దాలుగా ఒంగోలు ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయింది. పరిశ్రమలు, ఉపాధి, నీటి సౌకర్యం లేక వలసలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎన్నికల సమయంలో రూ. 150 కోట్లు ఖర్చు చేసే సామర్ధ్యం ఉన్న నాయకులు ఈ ప్రాంతంలో ఉన్నారు.

కానీ రూ. 150 కోట్లుతో పరిశ్రమలు పెట్టి యువతకు ఉపాధి కల్పించాలనే ఆలోచన ఉన్న నాయకులు మాత్రం లేరు. ఇలాంటి పరిస్థితులు మారాలనే జనసేన పార్టీ పెట్టాను. అర్జెంటుగా గద్దెనెక్కాలనే ఆశ లేదు. దేశం కోసం పని చేయాలనే పాతికేళ్ల ప్రస్థానం అని చెప్పాను. 
 
అధికారమే లక్ష్యమైతే రాజకీయం వేరేగా ఉండేది ...
పార్టీ నిర్మాణం చాలా కష్టంతో కూడుకున్న పని. నా ప్రభావం సమాజానికి ఉపయోగపడేలా ఉండాలనే ఉద్దేశంతోనే ఫ్యాన్సు ఆర్గనైజేషన్ పెట్టలేదు. ప్రజారాజ్యం పార్టీ అనుభవం తర్వాత కూడా పార్టీ పెట్టడం దుస్సాహసం. మన పూర్వీకులు ఆత్మబలిదానాలు, త్యాగాలు చేశారు.

వారి త్యాగాలు వృథా కాకూడదు, సమాజంలో మార్పు తీసుకురావాలనే ఆలోచనతోనే పార్టీ పెట్టాను.  పార్టీ ప్రారంభించినప్పుడు నా పరిమితులు నాకు బాగా తెలుసు. నా బలమెంతో తెలుసు, బలహీనత కూడా తెలుసు. నిజంగా జనసేన పార్టీకి అధికారమే లక్ష్యమైతే ఆ రాజకీయం వేరుగా ఉండేది.

సమాజంలో లోపాలను రాజకీయ పార్టీలు సరిదిద్దాలి. లేకపోతే  ప్రజల మధ్య అసమానతలు తలెత్తి దేశ సమగ్రతకు భంగం వాటిల్లే ప్రమాదం ఏర్పడుతుంది. భారతీయ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్ లాగా జనసేన పార్టీకి కూడా ఒక బలమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని చాలా మంది చెబుతున్నారు.

ఆర్ఎస్ఎస్ ఇంత బలంగా తయారవ్వడం వెనుక దశాబ్ధాల కృషి, బలమైన భావజాలం ఉంది. క్రియాశీలకంగా పనిచేసే చాలా మంది దేశం కోసం సర్వం త్యాగం చేస్తారు. పెద్దగా హిందువులు లేని ఈశాన్య ప్రాంతంలో కూడా బీజేపీ గెలిచింది అంటే దానికి కారణం వాళ్ల కమిట్మెంట్.

అక్కడ అందరితో మాట్లాడి, వాళ్లను ఒప్పించి పార్టీకి ఓట్లు వేసేలా చేశారు. ఆర్ఎస్ఎస్ సంస్థ దేశం, అభివృద్ధి చూస్తుందే తప్ప వారసత్వాన్ని చూడదు. జనసేన పార్టీని ఇష్టపడేది యువత, మధ్య తరగతి మనుషులు.

ఎక్కువగా స్వశక్తిని నమ్ముకున్న వాళ్లే జనసేన పార్టీకి అండగా ఉంటున్నారు. నిజంగా వీళ్లు బలంగా సమాజంలో మార్పు రావాలని కోరుకుంటే మార్పు వచ్చి తీరుతుంది. 
 
పరిస్థితి మారకపోతే చాలా కష్టం...
డబ్బు ప్రభావం లేకుండా ఎన్నికలకు వెళ్లడం అసాధ్యంగా మారింది. ఉత్తరాదితో పోల్చుకుంటే ఈ పరిస్థితి తెలుగు రాష్ట్రాలు, తమిళనాడులో చాలా ఎక్కువగా ఉంది. దీనిని మార్చకపోతే ప్రజలు తీవ్రంగా నష్టపోతారు.

మొన్నీమధ్య  ప్రకాశం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ‘మీకెందుకు పనులు చేయాలి. ఎన్నికల సమయంలో డబ్బులు తీసుకున్నారు కదా’ అని ప్రజల్ని తిట్టాడు. అలాంటి వ్యవస్థ, నాయకులు అవసరమా..? అనిపించింది.  డబ్బు ఇచ్చి ఓట్లు కొనకూడని పరిస్థితికి సమాజాన్ని తీసుకెళ్లాలి. అలాంటి సమాజాన్ని జనసేన పార్టీ తీసుకొస్తుంది.

రాజకీయ నాయకులు కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా మాట్లాడాలి. కానీ కొంతమంది నాయకులు స్వార్ధ రాజకీయాల కోసం కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. సమాజాన్ని విడగొట్టడం చాలా తేలిక, కానీ కలపడం మాత్రం చాలా కష్టం. 

నా బలాన్ని ఓటమిలోనే అంచనా వేసుకుంటాను. గెలుపును పది మందికి పంచేస్తాను కానీ.. ఓడిపోయినప్పుడు మాత్రం బలంగా నిలబడతాను. నిజమైన పార్టీ నిర్మాణం ఇప్పటి నుంచే మొదలైంది. ప్రగల్భాలు పలికే వలస పక్షులను కాకుండా మన పార్టీ మీద ప్రేమ ఉన్న యువతను గుర్తించండి.

పార్టీకి ఎక్కువ సమయం కేటాయించే వాళ్లకు కీలక బాధ్యతలు అప్పగించండి. త్వరలోనే యువతకు రాజకీయ శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి ఓటుకు నోటు తీసుకోవడం వల్ల వాళ్లు నష్టపోతుంది ఏంటో తెలియజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఒంగోలు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జ్ షేక్ రియాజ్ పాల్గొన్నారు.