Widgets Magazine

ఏపీలో రాబడి అంత ఆశాజనకంగా లేదు... యనమల

ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు అర్థ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ రాబడి ఆశాజనకంగా లేదని మంత్రి యనమల చెప్పారు. ఆదాయం పెరుగుదలలో వృద్ధిరేటు ఇబ్బందికరంగా ఉన్నట్లు తెలిపారు. జీఎస్టీ ప్రవేశపెట్టడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం సరిగా లేకపోవడం

Yanamala
chj| Last Modified సోమవారం, 30 అక్టోబరు 2017 (20:58 IST)
ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు అర్థ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ రాబడి ఆశాజనకంగా లేదని మంత్రి యనమల చెప్పారు. ఆదాయం పెరుగుదలలో వృద్ధిరేటు ఇబ్బందికరంగా ఉన్నట్లు తెలిపారు. జీఎస్టీ ప్రవేశపెట్టడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం సరిగా లేకపోవడం, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, నాన్ రెవెన్యూ ఆదాయం తగ్గడం వల్ల పరిస్థితి ఇలా ఉన్నట్లు వివరించారు. ఎక్సైజ్, మైన్స్ అండ్ మినరల్స్ శాఖల ఆదాయం కొంత మెరుగుగా ఉన్నట్లు తెలిపారు.

అదేసమయంలో వ్యయం కూడా ఎక్కువగా అవుతున్నట్లు చెప్పారు. నీటిపారుదల, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్ వంటి శాఖల్లో వ్యయం ఎక్కువగా అవుతున్నట్లు తెలిపారు. కొన్ని శాఖలు అదనపు బడ్జెట్ కోరుతున్నాయన్నారు. మూలధన వ్యయం రూ.10 వేల కోట్లకు పైగా ఖర్చుచేశామని, దీని ద్వారా స్థిరాస్తులు పెరుగుతాయని, అభివృద్ధిపై ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు చేస్తుందనడానికి ఇది నిదర్శనంగా పేర్కొన్నారు.

మూలధన వ్యయం మంచిదేనని, రెవెన్యూ వ్యయం మంచిదికాదన్నారు. ఉద్యోగులు డీఏ ఇచ్చామని, పీఆర్సీ భారం పెరుగుతోందని చెప్పారు. ఎఫ్ఆర్ బీఎం చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రూ. 23,794 కోట్లు రుణం తీసుకోవడానికి అవకాశం ఉందని, ఇప్పటివరకు రూ.16,100 కోట్లు రుణం తీసుకున్నామని, రూ.6వేల కోట్లు వడ్డీ చెల్లించినట్లు మంత్రి వివరించారు.

బిల్స్ ఎక్కువ పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఆర్థిక నియంత్రణ అవసరం అన్నారు. వ్యయాలను క్రమబద్దీకరించినట్లు చెప్పారు. జీతాలు ఆపడంలేదని, పెండింగ్ బిల్స్ కూడా పది రోజుల్లో చెల్లిస్తామని, ఆందోళన అవసరంలేదని చెప్పారు. నవంబర్ 10 నుంచి వర్క్ బిల్లులు అన్నీ చెల్లిస్తామని, కాంట్రాక్టర్లు ఎవరూ పనులు ఆపవలసిన అవసరంలేదన్నారు.

కేంద్రం నుంచి రావలసిన నిధులు
పోలవరం ప్రాజెక్ట్, గ్రామీణ ఉపాధి హామీపథకం(నరేగా) వంటి పనులకు రాష్ట్ర ప్రభుత్వమే ముందుగా ఖర్చు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. పోలవరానికి సంబంధించి రూ.1000 కోట్లు, నరేగాకు సంబంధించి రూ. 1200 కోట్లు కేంద్రం నుంచి రావలసి ఉందన్నారు. గతంలో నరేగా పనులకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు అందేవని, అందువల్ల తాము ముందుగా చెల్లించేవారమని చెప్పారు. ఇప్పుడు నరేగా నిధులను కేంద్రం నేరుగా కూలీలకే చెల్లిస్తోందని, అందువల్ల తాము ముందుగా చెల్లించడం సాధ్యం కాదన్నారు.


దీనిపై మరింత చదవండి :