ప్రజలంతా భోగి మంటలు వేస్తుంటే.. చంద్రబాబు మాత్రం కడుపులో మంటలు : రోజా
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సినీ నటి, వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా మరోమారు నిప్పులు చెరిగారు. ప్రభుత్వం జారీచేసిన పలు జీవోలను భోగిమంటల్లోవేసి చంద్రబాబు తగులబెట్టారు. దీనిపై రోజా మండిపడ్డారు.
ప్రజలంతా భోగి మంటలు వేసుకుంటుంటే చంద్రబాబు మాత్రం కడుపులో మంటలు వేసుకుంటున్నారని విమర్శించారు. ప్రజలకు మంచి చేసేందుకు జగన్ ప్రయత్నిస్తుంటే, చంద్రబాబు ముఖ్యమంత్రిపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు.
వైసీపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా జీవోలను తెచ్చిందని, వాటిని భోగి మంటల్లో తగులబెట్టాలని చంద్రబాబు చెప్పడం చూస్తుంటే ఆయన ఎంత దిగజారిపోయారో అర్థమవుతుందని అన్నారు.
రైతే రాజు అనే విధంగా రైతు అడిగినవి, అడగనివి కూడా చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు. జగన్ పాలనలో ప్రజలంతా హాయిగా ఉన్నారని చెప్పారు.
చంద్రబాబుకు ప్రజలు గత ఎన్నికల్లో బుద్ధి చెప్పినప్పటికీ ఆయన వైఖరిని మాత్రం ఇంకా మార్చుకోలేదన్నారు. ఇకపై రాష్ట్రంలో ఏకైక పార్టీ వైకాపా మాత్రమే ఉంటుందని, టీడీపీ అంతమైపోతుందని ఆమె జోస్యం చెప్పారు.