గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated : సోమవారం, 5 జులై 2021 (10:03 IST)

ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడు ఆర్.ఆర్.ఆర్... అంచు డాబే కానీ పంచె డాబు లేదు..

ఏపీ ముఖ్యమంత్రి, సొంత పార్టీ అధినేత వై.ఎస్. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఎంపీ ర‌ఘు రామ‌కృష్ణంరాజు లేఖాస్త్రాలు ఇంకా సంధిస్తూనే ఉన్నారు. సి.బి.ఐ. కేసు, దాడి, జైలు... చివ‌రికి ఆసుప‌త్రిపాల‌యినా... ప‌ట్టువిడువ‌ని విక్ర‌మార్కుడిలా ఆర్.ఆర్.ఆర్. తాజాగా ఇసుక‌పై లేఖ సంధించారు. రాష్ట్రంలో ఇసుక ధరలు తగ్గించేందుకు, బ్లాక్ మార్కెట్ లో ఇసుక అమ్మకాలను నిలుపుదల చేసేందుకు 2019 మే నెలలో అధికారంలోకి వచ్చిన వెంటనే నూతన ఇసుక సరఫరా విధానాన్ని రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించింద‌ని... ఇపుడు అది ఏం చేస్తోంద‌ని ఆర్.ఆర్.ఆర్. త‌న లేఖ‌లో ప్ర‌శ్నించారు. 
 
ఇసుక సరఫరా బాధ్యతను కాంట్రాక్టర్ కు అప్పగించార‌ని, ఆనాటి నుంచి ఇసుక కొరత మరింత తీవ్రమైంద‌ని, రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ రంగం స్థంభించిపోయింద‌న్నారు. దీనివల్ల సిమెంటు, ఇనుము అమ్మకాలు తగ్గిపోయాయి. ఈ పరిణామాల ఫలితంగా రాష్ట్రంలో నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు దారుణంగా పడిపోయాయి. ఈ అన్ని అంశాలపై ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. 
 
ఈ పరిణామాలు తలెత్తిన కొత్తలోనే నేను ఈ అంశాలన్నింటిని మీ దృష్టికి తీసుకువచ్చాను. అయితే మీరు నేను చెప్పిన విషయాలను అర్ధం చేసుకుని అందుకు పరిష్కారం ఆలోచించకుండా, నన్ను అపార్థం చేసుకుని నాపై కక్ష పెంచుకున్నారు....అని రఘురామ వాపోయారు. 
 
ఇవన్నీ జరిగిన తర్వాత మీరు ఇంకో ఇసుక పాలసీని తీసుకువచ్చారు. మీరు తీసుకువచ్చిన ఈ రెండవ ఇసుక పాలసీ కూడా దారుణంగా విఫలమైంది. పర్యవసానంగా మీరు మూడో ఇసుక పాలసీని తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇసుక తవ్వకం, అమ్మకం నుంచి సరఫరా వరకూ జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ (JPVL) అనే ప్రయివేటు కంపెనీకి ధారాదత్తం చేశారు.
 
ఏపి మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APMDC) రాష్ట్రంలోని అన్ని ఇసుకరీచ్ లను ఈ కంపెనీకి కట్టబెట్టేసింది. అయితే ‘‘అంత ఉరుము ఉరిమి… ఇంతేనా కురిసింది’’ అన్నట్లు ఆ కంపెనీ 300 ఇసుక రీచ్ లలో కనీసం సగం రీచ్ లలో కూడా ఇప్పటికీ ఇసుక తవ్వకాలను ప్రారంభించలేకపోయింద‌ని విమ‌ర్శించారు.  
నూతన పాలసీ ప్రకారం ఇసుక రీచ్ ల వద్దకే వెళ్లి కొనుగోలుదారుడు ఇసుక నాణ్యత పరిశీలించుకోవచ్చు. 
 
అక్కడి ఇసుక నాణ్యత నచ్చితే దాన్ని ర్యాంప్ వద్దే కొనుగోలు చేయవచ్చు. అయితే ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసా? ‘‘గతి లేనమ్మకు గంజే పానకం’’ అన్నట్లుగా ఉంద‌న్నారు.
ఇసుక లభ్యతను పెంచేందుకు చర్యలు తీసుకోవాల్సిన రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో అది పెద్ద అంశం కాదన్నట్లుగా మాట్లాడారు. 
 
రూ.765 కోట్ల ఆదాయం తీసుకువచ్చేందుకు తామంతా కృతనిశ్చయంగా ఉన్నామని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు కానీ అక్కడ జరుగుతున్నది మాత్రం శూన్యమ‌ని ఆర్.ఆర్.ఆర్. పెద‌వివిరిచారు. 
 
 
 
కేంద్ర ప్రభుత్వం MNREGA నిధుల నుంచి రోడ్లు ఇతర సౌకర్యాల కల్పనకు నిధులు ఇస్తున్నా, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద  ప్రతి ఇంటి నిర్మాణానికి 1.5 లక్షల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తున్నా కూడా ఈ స్కీమ్ మొత్తానికి మీ పేరు పెట్టుకుని ‘‘జగనన్న ఇళ్ల కాలనీలు’’ అంటూ మొత్తం క్రెడిట్ ను మీరే సొంతం చేసుకోవడానికి మీరు వేసిన ఎత్తుగడను ఈ సందర్భంగా మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాని ర‌ఘ‌రామ కొస‌మెరుపు విసిరారు. ‘‘ అంచు డాబే కానీ పంచె డాబు లేదు’’.
 అందువల్ల మీరు తక్షణమే మీ ప్రియమైన ఇసుక పాలసీని ఇప్పటికైనా మార్చుకోండ‌ని ఉచిత స‌ల‌హా ప‌డేశారు ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజు.