1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (10:16 IST)

నిండు ప్రాణం బలైనా.. స్పందించరా? అధికారులపై మండిపడ్డ స.హ.చట్టం కమిషనర్

‘బిడ్డను కోల్పోయిన తండ్రికి ఎంతో మనోవేదన ఉంటుంది. తన బిడ్డ చనిపోవడానికి కారణాలు తెలుసుకోవాలని ఎవరికైనా ఉంటుంది. సాధారణంగానే అడిగిన సమాచారం ఇవ్వాలి. మరి ఇలాంటి పరిస్థితులలో ఇవ్వలేదంటే మిమ్మల్ని ఏమనాలి? ఎందుకు అలా వ్యవహరించారు..? కళాశాల రెన్యూవల్ నిలిపివేయాల్సి వస్తుంద’ని సమాచార హక్కు చట్టం కమిషనర్ విజయలక్ష్మి ఎన్టీయార్ హెల్త్ యూనివర్శిటీ, అధికారులపై మండిపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. 
 
తూర్పు గోదావరి జిల్లా కరప మండలం వేలంగి గ్రామానికి చెందిన మేర్లభవానీ శంకర ప్రసాద్‌ కుమార్తె శ్రీలక్ష్మి (24) పీజీలో 108 ర్యాంకుతో రాజమండ్రిలోని జీఎస్‌ఎల్‌ వైద్య కళాశాల్లో ఎండీ రేడియాలజీ కోర్సు చదువుతుండేది. ఆమె 2014 ఫిబ్రవరిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై పోలీసు స్టేషనులో కేసు నమోదయ్యింది. అక్కడ ప్రొఫెసర్లు లేక బోధన కొరవడింది. 
 
దీనిపై ప్రశ్నించిన తన కుమార్తెను కళాశాల యాజమాన్యం అనేక రకాలుగా వేధించిందనీ, చివరకు తన కుమార్తె మరణానికి అదే కారణమయ్యిందని ఆమె తండ్రి శంకర ప్రసాద్ ఆరోపిస్తున్నారు. వైద్య విద్యకు సంబంధించి నిబంధనలను ఓ ప్రైవేటు వైద్య కళాశాల ఎలా పాటిస్తుందో? తెలియజేయాలని సమాచార హక్కు(స.హ.) చట్టం ద్వారా కోరగా ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయం వారు స్పందించడం లేదని చెప్పారు. 
 
స.హ. చట్టం రాష్ట్ర కమిషనరు ఎం.విజయనిర్మల విజయవాడలోని ఉప కలెక్టరు కార్యాలయ సమావేశ ప్రాంగణంలో గురువారం స.హ.చట్టం కేసులపై విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ వైద్య విశ్వ విద్యాలయానికి చెందిన కేసు విచారణకు వచ్చింది. భవానీ శంకర్‌ చెప్పిన అంశాలను విన్న విజయలక్ష్మి  ఎన్టీఆర్‌ విశ్వవిద్యాలయ రిజిస్ట్రారు డాక్టరు బాబూలాల్‌పై, సంబంధిత అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
విశ్వవిద్యాలయం కోరిన సమాచారాన్ని వైద్య కళాశాల వారు ఇవ్వకపోతే కళాశాల రెన్యువల్‌ను నిలిపి వేయవచ్చని, యూనివర్శిటీకి ఉన్న అధికారాలను వినియోగించి, తగు సమాచారాన్ని తెప్పించుకోవచ్చని సూచించారు. వైద్య పరమైన స.హ. చట్టం కేసుల్లో నిర్లక్ష్య వైఖరి కనిపిస్తోందని, తదుపరి విచారణను ఎన్టీఆర్‌ వర్శిటీలోనే నిర్వహించేలా చూస్తామన్నారు.