శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (10:33 IST)

ఎమ్మెల్యే ఆదిమూలంను అరెస్టు చేసి.. తర్వాత నా వద్దకు రండి.. బాధితురాలు

koneti aadimulam
తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఆదిమూలంపై అత్యాచార ఆరోపణలు చేసిన స్థాని టీడీపీ మహిళా కార్యకర్త పోలీసులకు సైతం చుక్కులు చూపిస్తున్నారు. తన వద్దకు విచారణకు వచ్చే ముందు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను తొలుత అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఆ తర్వాత తన వద్దకు రావాలని ఆమె కోరారు. 
 
ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపుల కేసు పెట్టిన ఆ మహిళ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషనులో సోమవారం హల్చల్ చేశారు. ఉదయం 11 గంటలకు ఆమె భర్తతో కలసి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్న సీఐ మహేశ్వర్ రెడ్డిని కలిసి తనను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటూ ప్రశ్నించారు. లైంగిక వేధింపుల కేసులో బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించడమనేది చట్టబద్దమని సీఐ చెబుతున్నా ఆమె వినిపించుకో లేదు. వైద్య పరీక్షల పేరిట తనను ఇబ్బంది పెట్టవద్దని, తాను హాజరుకానని తేల్చి చెప్పారు. తనకు రాత్రి నుంచీ గుండెల్లో నొప్పిగా వుందని, వైద్య పరీక్షల కోసం చెన్నై వెళుతున్నానని తెలిపారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం అవసరమైతే సర్జరీ చేయించుకుంటానని తెలిపారు. ఆ తర్వాత తిరుపతి రుయాస్పత్రికి వైద్య పరీక్షలకు వస్తానన్నారు. 
 
తనను ఇబ్బంది పెట్టవద్దని, తనకు ఫోన్లు కూడా చేయవద్దని స్పష్టం చేశారు. తాను బాధితురాలిగా ఫిర్యాదు చేశానని, ఎమ్మెల్యేని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో సీఐ మహేశ్వర్ రెడ్డి విషయాన్ని డీఎస్పీ వెంకటనారాయణ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సూచన మేరకు సీఐ ఆమె నుంచి లిఖితపూర్వకంగా స్టేట్‌మెంట్ తీసుకున్నారు. ఆమె వెనుదిరిగే సమయానికి పలువురు మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకోవడంతో ఆమె మళ్లీ సీఐ చాంబర్‌లోకి వెళ్లి పోయారు. మీడియాతో మాట్లాడేందుకు అంగీకరించలేదు. తర్వాత ముఖానికి ముసుగు వేసుకుని, వాహనాన్ని స్టేషన్ ఆవరణలోకి రప్పించుకుని అందులో వెళ్లిపోయారు.