బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Modified: సోమవారం, 4 అక్టోబరు 2021 (21:10 IST)

మీ నాశనానికి మీరే ముహూర్తం పెట్టుకున్నారు: ప్రియాంకా గాంధీ అరెస్టుపై శైలజానాథ్

విజయవాడ : రైతులను పరామర్శించేందుకు, బీజేపీ నాయకత్వాన్ని ఎండగట్టేందుకు, మోడీ, షా, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నించేందుకు వెళ్లిన ప్రియాంకా గాంధీని అరెస్ట్ చేయడం అన్యాయం అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలాజనాథ్ అన్నారు. ప్రియాంకా గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సాయంత్రం విజయవాడలో జోరు వర్షంలోనూ కాంగ్రెస్ పార్టీ నిరసన ప్రదర్శన నిర్వహించింది.

ఆంధ్ర రత్న భవన్ నుంచి ప్రారంభమైన ఈ నిరసన ప్రదర్శన తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు సాగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలాజనాథ్ మాట్లాడుతూ రైతుల న్యాయమైన డిమాండ్లను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించే సమయం ఆసన్నమైందన్నారు. ప్రియాంకా గాంధీని విడుదల చేయాలనీ, నల్ల చట్టాలను రద్దు చేయాలని శైలజనాథ్ డిమాండ్ చేశారు.

రైతుల మరణాలను 1977 అక్టోబర్ 3వ తేదీన ఇందిరాగాంధీని అరెస్టు చేసారని, నిప్పుతో చెలగాటమాడుతూ వారి నాశనానికి వారే ముహూర్తం పెట్టుకున్నారని అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా, రాజ్యాంగ బద్ధంగా పాలించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. బిజెపి ప్రభుత్వం రైతాంగ, కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చి ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతుందన్నారు. రైతులపై కేసులు పెట్టే ప్రయత్నం చేయడం తగదన్నారు.

తక్షణమే వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇలా ప్రవర్తిస్తూ పొతే మీ పతనం తధ్యమని అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వం లో కాంగ్రెస్ పార్టీ బలంగా ముందుకు పోతుందని శైలజానాథ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు డా గంగాధర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ ఇంచార్జి పరస రాజీవ్ రతన్, రాష్ట్ర మైనారిటీ చైర్మన్ దాదా గాంధీ,  నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహారశెట్టి నరసింహారావు, రాష్ట్ర లీగల్ సెల్ చైర్మన్ వళిబొయిన గురునాధం, రాష్ట్ర ఆర్టీఐ చైర్మన్ పివై కిరణ్ కుమార్, రాష్ట్ర హ్యూమన్ రైట్స్ చైర్మన్ మన్నం రాజశేఖర్, కృష్ణ రురల్ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు బొర్రా కిరణ్, మహిళ కాంగ్రెస్ నాయకురాలు ప్రమీల గాంధీ, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి పాయల్ బోస్ తదితరులు పాల్గోన్నారు.