గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 20 జులై 2020 (20:36 IST)

వికేంద్రీకరణను అడ్డుకునేందుకు చంద్రబాబు చిల్లర వేషాలు: సజ్జల రామకృష్ణారెడ్డి

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని, పిల్లి శాపాలు పెడుతున్నారని రాష్ట్రప్రభుత్వ సలహాదారుసజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.

గుంటూరుజిల్లా తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సిపి కేంద్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ కుల్లు, కుతంత్రాలతో వికేంద్రీకరణ బిల్లు చట్టరూపంలోకి రాకుండా వుండాలని ప్రయత్నిస్తోందని ఈ సందర్బంగా అన్నారు.

రాజ్యాంగబద్దంగా గవర్నర్‌ ద్వారా చట్టంగా మారబోతున్న వికేంద్రీకరణ బిల్లును ఈ దశలోనూ అడ్డుకోవాలని చంద్రబాబు, ఆయన అనుయాయులు నానా తంటాలు పడుతున్నారని అన్నారు. నిజంగా వికేంద్రీకరణకు వ్యతిరేకం అయితే ఆ విషయంలో తెలుగుదేశం వైఖరి ఏమిటో చంద్రబాబు స్పష్టం చేయాలని, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలపై టిడిపి వైఖరిని వివరించాలని డిమాండ్ చేశారు. 
 
ఇంకా ఆయన ఏమన్నారంటే....
రాష్ట్రప్రభుత్వం మూడు ప్రాంతాలకు పరిపాలనను విస్తరింపచేయాలనే లక్ష్యంతో రూపొందించిన వికేంద్రీకరణ బిల్లును ఎలా అడ్డుకోవాలా అని తెలుగుదేశం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆలోచిస్తున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి అనే ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌ విజన్‌ను ఎలా అడ్డుకోవాలనే కుత్రంత్రంలో భాగంగా వారం రోజులుగా ఈ అంశంపై దాడి చేస్తున్నారు. వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృధ్ధి అనేది ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కల.

ఈ అంశం ఏనాడు అయితే ప్రకటించారో అప్పటి నుంచి ఒక వర్గం దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆ వర్గంకు ప్రతినిధిగా చెప్పుకుంటున్న తెలుగుదేశం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు వికేంద్రీకరణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు.

రాష్ట్రప్రజల ఆకాంక్షలు, ప్రయోజనాలను పక్కకు పెట్టి, ఒక చిన్న ప్రాంతంకు సంబంధించిన ప్రయోజనాలకు వారు పరిమితమయ్యారు. చంద్రబాబు, ఆయన బినామీలకు సంబంధించిన బాధను, ప్రపంచ బాధగా చూపిస్తున్నారు. అమరావతి ప్రాంతంలో చంద్రబాబు తన ప్రయోజనాలను కాపాడుకునేందుకు మరోసారి పెద్ద డ్రామాకు తెరలేపారు. 
 
అమరావతితో పాటు విశాఖ, కర్నూలుకు కూడా రాజధానిని విస్తరించేస్తుంటే... చంద్రబాబు సహించలేక పోతున్నారు. తాను సృష్టించిన స్వప్నం భగ్నమైనట్లు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు తీరును రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. వికేంద్రీకరణ వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనే విషయంలో ప్రజలు చాలా స్పష్టంగా వున్నారు.

అంతేకాదు అమరావతి ప్రాంతంలోని వారు కూడా వికేంద్రీకరణను అర్థం చేసుకుంటున్నారు. అమరావతిలో బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేసిన వారు, తమ స్వార్థప్రయోజనాలకు ఈ నిర్ణయం భంగం కలిగిస్తుందని భయపడుతున్నారు. అందుకే చంద్రబాబు ప్రోద్భలంతో కొద్దిమందిని సమీకరించి, టెంట్‌లు వేసి ఆందోళనలు చేస్తున్నారు. ఇది కూడా క్రమంగా నీరుగారిపోతోంది. 
 
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి వికేంద్రీకరణ అనివార్యం
ఈ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసే దిశగా వికేంద్రీకణకు సీఎం వైయస్‌ జగన్ అడుగులు వేస్తున్నారనే సత్యాన్ని ప్రజలు అంగీకరిస్తున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలు పూర్తి వెనుకబాటుతనంతో వున్నాయి. అక్కడి ప్రజల ఆకాంక్షలకు రూపం ఇవ్వడం కోసం వికేంద్రీకరణ అనివార్యం.

అదే క్రమంలో అమరావతి ప్రాంతంలోని ప్రజలకు కూడా ఎటువంటి నష్టం జరగకుండా చూడటం ఈ ప్రభుత్వ బాధ్యత. అందరికీ పరిపాలనను, అభివృద్ధిని చేరువ చేయడం కూడా బాధ్యతే. వెనుకబడిన ప్రాంతం ప్రజలు కూడా ఈ ప్రభుత్వంలో మమ్మల్ని భాగస్వాములను చేశారనే సంతోషంగా నేడు వున్నారు.

దీనిని చట్టరూపంలోకి తీసుకువచ్చే ప్రక్రియను చేస్తుంటే... చంద్రబాబు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు. ప్రజల ఆకాంక్షలు వాస్తవరూపం దాలుస్తున్న తరుణంలో దానికి ఆటంకాలు కల్పించే లక్ష్యంతో చంద్రబాబు, టిడిపి నేతలు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు వాస్తవాలను చూడటానికి, అంగీకరించడానికి సిద్దంగా లేరు. వికేంద్రీకరణపై తమ అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి ప్రతిపక్షంకు అసెంబ్లీ ఒక వేదిక. అక్కడ వారు తమ వాదనను వినిపించవచ్చు.

కానీ అందుకు భిన్నంగా కౌన్సిల్‌లో తమకు మందబలం వుందని, వికేంద్రీకరణ బిల్లుపై గొడవ సృష్టించారు. టిడిపి మాదిరిగా వంద సీట్లతో గెలిచి, ఇటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఆనాడు అమరావతిలో రాజధాని అంటే, రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతిపక్ష నేతగా, ఎంతో బాధ్యతతో వైయస్‌ జగన్‌ సూచించారు.

అంతేకానీ అమరావతిని గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఇప్పుడు 55శాతం ఓట్లతో, బ్రహ్మాండమైన మెజారిటీతో పరిపాలన చేసేందుకు వైయస్‌ఆర్‌సిపికి ప్రజలు అధికారంను అప్పగించారు. చక్కని పాలన ఇవ్వాలని ఆశీర్వదించారు. రాష్ట్ర ప్రజలకు జవాబుదారీతనంతో అభివృద్ధిని అందించాలనే లక్ష్యంతో వైయస్‌ జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఎక్కడా సంయమనం కోల్పోకుండా, ఏకపక్షంగా నిర్ణయాలు జరగకుండా, అన్నింటా రాజ్యాంగబద్దంగా వ్యవహరిస్తున్నారు. చివరికి పరిపాలనా వికేంద్రీకరణపై కూడా సబ్ కమిటీ వేశారు. పలు సంస్థలతో సర్వే చేయించారు. ఆ నివేదికలపై చర్చించిన తరువాతే ఈ అంశాన్ని అసెంబ్లీలో పెట్టారు. అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లు కౌన్సిల్‌కు వెడితే చంద్రబాబు గ్యాలరీలో కూర్చుని చైర్మన్‌తో ఏం చేయించారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.

రెండోసారి తిరిగి శాసనసభలో ఆమోదించి కౌన్సిల్‌కు పంపితే, దానిని కూడా అడ్డుకోవాలని ప్రయత్నించి విఫలమయ్యారు.  కౌన్సిల్‌లో రెండోసారి టేబుల్ అయిన వికేంద్రీకరన బిల్లు, నెలరోజుల తరువాత రాజ్యాంగబద్దంగా చట్టరూపం దాల్చడానికి గవర్నర్‌ ముందుకు వెళ్లింది. ఇదంతా చట్టపరంగా జరగుతున్న ప్రక్రియ. కానీ ఈ అంశంలో  సెలెక్ట్ కమిటీకి పంపాల్సిన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదంటూ చంద్రబాబు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు.

ఆనాడే సెలెక్ట్ కమిటీకి ఈ అంశాన్ని పంపలేదని సాక్షాత్తు చైర్మన్ చెప్పిన విషయం చంద్రబాబుకు తెలియదా? అసలు సెలెక్ట్ కమిటీనే లేదు. దీనిపేరుతో వికేంద్రీకరణ బిల్లును నెలల తరబడి జాప్యం జరిగేలా చూడాలన్నదే చంద్రబాబు దుర్భుద్ది. చంద్రబాబు చేసిన చిల్లర ఆలోచనలు ఫలించడం లేదు. అందుకే మరోసారి డ్రామా ప్రారంభించారు.
 
అమరావతికి అవసరం కాని రాష్ట్రపతి సంతకం ఇప్పుడెందుకు అవసరం..?
వికేంద్రీకరణ బిల్లు రాజ్యాంగబద్దంగా జరిగింది. దానిని గవర్నర్‌ చట్టంగా ఆమోదిస్తారు. ఈ దశలో రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగిపోతున్నాయంటూ ముందు అమరావతి కమిటీ, తరువాత యనమల రామకృష్ణుడు, ఆ తరువాత చంద్రబాబు వరుసబెట్టి నానా యాగీ చేస్తున్నారు. ఆనాడు సీఎంగా అమరావతి రాజధానిపై చట్టం చేసినప్పుడు అవసరం రాని రాష్ట్రపతి సంతకం ఈ రోజు ఎందుకు అవసరమో చంద్రబాబు చెప్పాలి.

రాజధానికి, లేదా రాజధానులకు, విజభజన చట్టంకు సంబంధం ఏమిటో వివరించాలి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పరిపాలనా విభాగాన్ని పెట్టడం ద్వారా ప్రాంతీయ సమతౌల్యత తెస్తున్నాం. దీనికి కేంద్రం అనుమతి అవసరం లేదు. ఎవరిని తప్పుదారి పట్టించేందుకు చంద్రబాబు  ఇటువంటి అంశాలను తెరమీదికి తెస్తున్నారు? ఇదంతా నాలుగు రోజుల పాటు జరిగే హంగామానే. రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందనే తప్పుడు ప్రచారంతో చికాకు పెట్టడం, చిల్లర చేష్టలు చేస్తున్నారు.

ఎన్ని జన్మలు ఎత్తినా చంద్రబాబు మారరు. గతంలో దీనిపైనే కోర్ట్ లో పిటీషన్లు వేయించారు. కోర్ట్‌లోనూ పారదర్శకంగా, రాజ్యాంగబద్దంగా మేం తీసుకున్న నిర్ణయంపై ఇదే విధంగా మా వాదనలను వినిపించబోతున్నాం. ప్రజల ఆకాంక్షలకు సీఎం వైయస్‌ జగన్ కట్టుబడి వున్నారు. దానిని సంపూర్ణంగా నెరవేర్చి తీరుతాం. చంద్రబాబు పిల్లి శాపాలు పెడుతూ... మంచికోసం జరిగే యజ్ఞంలో రాక్షసులు వ్యర్థాలు వేసినట్లు తన చర్యలతో వికేంద్రీకరణ ప్రక్రియకు ఆటంకాలు కలిగిస్తున్నారు.
 
రాజధానిపై టీడీపీ ఏనాడూ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించలేదు
తెలుగుదేశం ప్రభుత్వం రాజధానిపై ఏనాడు రాజ్యాంగబద్దంగా నిర్ణయం తీసుకోలేదు. ఆనాడు నారాయణ కమిటీ ఏర్పాటు చేసి అమరావతిని ప్రకటించారు. అంతకు ముందు శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణ కమిటీలు పరిపాలనా వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ గురించి చెప్పిన అంశాన్ని పూర్తిగా పక్కకు పెట్టారు.

నిస్సిగ్గుగా తన స్వార్థ ప్రయోజనాల కోసం అమరావతి అనే భ్రమరావతిని సృష్టించారు. సంప్రదాయాలు, చట్టాలకు అతీతంగా రాజధాని నిర్ణయం తీసుకున్నారు.  ఆనాడు అసెంబ్లీలో అతిపెద్ద ప్రతిపక్షంగా వుండి ఏకపక్షంగా మీరు తీసుకుంటున్న నిర్ణయంలోనూ రైతుల ప్రయోజనాలను కాపాడాలనే చెప్పాం.

ఈ ప్రాంతంలో రాజధాని నిర్మాణంకు భారీ వ్యయం అవుతుందని చెప్పాం. ప్రజలకు జవాబుదారీగా వుండి కూడా మీ నిర్ణయాన్ని సమర్థించాలా? చంద్రబాబుకు ప్రజలు, ప్రజాస్వామ్యం, ప్రతిపక్షం, కేంద్రం, వారు పెట్టిన కమిటీలు అంటే ఏ మాత్రం గౌరవం లేదు.
 
రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చంద్రబాబు వైఖరి ఏమిటీ?
పద్దతిప్రకారం రాజ్యాంగ బద్దంగా పోతున్నాం. అసెంబ్లీ, కౌన్సిల్, గవర్నర్ ద్వారా వికేంద్రీకరణ బిల్లు  చట్టం అవుతుంది. ఈ విషయంలో చంద్రబాబు ఏ వైపు వున్నారు? అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని నిపుణులు, పర్యావరణవేత్తలు చెబుతున్నారు. వికేంద్రీకరణ వద్దంటే ఆ విషయాన్ని చంద్రబాబు స్పష్టంగా చెప్పాలి. చంద్రబాబు కేవలం ఒక చిన్న ప్రాంతంకే పరిమితం కావాలనుకుంటే, దానినే ప్రకటించండి.

అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని చంద్రబాబు భావించడం లేదా? రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చంద్రబాబు వైఖరి ఏమిటీ? విశాఖ ఎగ్జిక్యూటీవ్ కేపిటల్ గా సీఎం జగన్ గారు ప్రతిపాదించారు. అది త్వరలో సాకారం అవుతోంది. దానిపై చంద్రబాబు వైఖరి ఏమిటీ? 
 
చంద్రబాబు చేసిన తప్పులను జగన్ సవరిస్తున్నారు..
అమరావతి రాజధాని ప్రకటించిన తరువాత ఈ ప్రాంతంలో అభివృద్దికి సీఎంగా వుండి చంద్రబాబు ఎంత కేటాయించారు? ఆయన చేసిన ఖర్చులో ఎక్కువ భాగం టిడిపి వారి జేబుల్లోకి వెళ్లింది. పరిశ్రమలు, ఎడ్యుకేషన్ వంటి రంగాలను సైతం నిర్లక్ష్యం చేసి, అమరావతి ప్రాంతాన్ని బీడు పెట్టారు. కేవలం గ్రాఫిక్స్ పేరుతోనే ప్రజలను మభ్యపెట్టారు. అధికారం దూరం కాగానే చేతులు దులుపుకుని చంద్రబాబు వెళ్లిపోయారు.

ప్రజలకు జవాబుదారీగా వున్న సీఎం వైయస్‌ జగన్ ఈ తప్పులను సవరిస్తూ, సమగ్ర ప్రణాళికతో రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. చంద్రబాబుకు కూడా అమరావతిలో తన స్వార్థ ప్రయోజనలు లేకపోతే అభివృద్ధి వికేంద్రీకరణను ఆమోదించేవారే. మహాయజ్ఞంగా జరుగుతున్న ఈ ప్రక్రియను భగ్నం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు చేస్తున్న కుట్రలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. 
 
రాజధాని రాష్ట్రాల పరిధిలోనిదేనని కేంద్రం స్పష్టం చేసింది
బిజెపి కేంద్ర నాయకత్వం కూడా రాజధాని అంశం రాష్ట్రాల పరిధిలోనిది అని, దానిలో మేం జోక్యం చేసుకోమని చెబుతోంది. కానీ ఇక్కడ వున్న కొందరు బిజెపి నేతలు మాత్రమే దీనిపై భిన్నంగా మాట్లాడుతున్నారు. అమరావతిలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం సిట్ వేసింది. విచారణ జరగుతోంది. ఇప్పటికే కొందరు అరెస్ట్ అయ్యారు. చట్టప్రకారం జరిగే విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయి