ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 27 మే 2021 (10:51 IST)

మీ సేవలకు ప్రజలందరి తరపున సెల్యూట్‌..: జగన్‌

‘వైద్యులు, వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు అసమానం.. ఒక తల్లి మాదిరి సేవలు చేస్తున్న మీకు ధన్యవాదాలు’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రాణాంతకం అని తెలిసినా రోగులకు సేవలు అందిస్తున్నారని వైద్యులు, వైద్య సిబ్బంది సేవలను కొనియాడారు. ఎలాంటి సహాయ, సహకారం కావాలన్నా అందించేందుకు సిద్దమని ప్రకటించారు.

వైద్యులు, వైద్య సిబ్బందితో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన వైద్యులు, వైద్య సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం కలెక్టర్లతో జరిగిన సమావేశంలో వైఎస్సార్ జలకళ, ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాల ప్రగతిని సీఎం జగన్‌ తెలుసుకున్నారు. సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడారు.

‘కోవిడ్‌పై పోరాటంలో నిమగ్నమైన సిబ్బందికి అభినందనలు. మన రాష్ట్రానికి మహా నగరాలు లేవు, అంత పెద్ద మౌలిక సదుపాయాల్లేవు కానీ.. గట్టి కృషి ద్వారా కోవిడ్‌పై పోరాటం చేస్తున్నారు. వైద్యులు, నర్సులు, వలంటీర్లు, ఆశా కార్యకర్తలు, పారిశుద్ధ సిబ్బందితో పాటు.. ప్రతి ఒక్కరూ అద్భుతంగా పనిచేస్తున్నారు. కొద్ది రోజులుగా జిల్లాల్లో కేసులు తగ్గుతున్నాయి.

ఇది సానుకూల పరిస్థితి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు ఎక్కువగా సారించాలి. కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. కరోనా సోకినవారిలో 70 శాతానికి పైగా ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందిస్తున్నాం. 50 శాతం బెడ్లు కచ్చితంగా ఆరోగ్యశ్రీ పేషెంట్లు ఇవ్వాలి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిబంధనలు కచ్చితంగా అమలు కావాలి.

ఆరోగ్యమిత్రలు, సీసీ కెమెరాలు సమర్థవంతంగా పనిచేయాలి’ అని వైద్యులు, వైద్య సిబ్బందికి సీఎం వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు.  అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలి. ఇది మహమ్మారి సమయం, ప్రతి పేదవాడికి సేవలు చేయాల్సిన సమయం. 104 కాల్‌సెంటర్ వన్‌ స్టాప్ సొల్యూషన్‌గా పెట్టాం. మన బంధువులే మనకు ఫోన్‌ చేస్తే ఎలా స్పందిస్తామో.. 104కు ఎవరైనా ఫోన్ చేస్తే అలాగే స్పందించాలి.

జర్మన్ హేంగర్లపై కలెక్టర్లు, జేసీలు దృష్టి పెట్టాలి. ఆక్సిజన్‌ ఎయిర్ కండిషన్ పెట్టాలి, శానిటేషన్ బాగుండాలి. రోగులకు మంచి ఆహారం అందించాలి. ఆక్సిజన్ సరఫరా 330 టన్నుల నుంచి 600 టన్నుల సామర్థ్యానికి పెంచాం. కనీసం రెండ్రోజులకు సరిపడా నిల్వలను అందుబాటులో ఉంచాం.

ఆక్సిజన్ వినియోగంపై ఎప్పటికప్పుడు ఆడిటింగ్ జరగాలి. ప్రతి ఆస్పత్రిలో ఆక్సిజన్ నిల్వలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు ఇస్తున్నాం’ అని సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు.