అమరావతి రాజధాని రైతుల... ఉద్యమ సమర క్రాంతి సంబరాలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సంక్రాంతిని ఉద్యమంతో కలగలిపి చేస్తున్నారు. పండుగ సందర్భంగా ఉద్యమ సమర క్రాంతి పేరుతో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో తుళ్ళూరు శిబిరం వద్ద సంబరాలను ఏర్పాటు చేశారు.
ఆంధ్రుల సమర క్రాంతిలో భాగంగా రాజధాని రైతులు వంటా వార్పు నిర్వహించారు. ఉద్యమ గాలి పటాలు, అమరావతి ఆకుపచ్చ బెలూన్ లు గాలిలోకి ఎగురవేసి సంక్రాంతి ఉద్యమ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. అమరావతి రైతులు, రైతు కూలీలు, మహిళలు శిబిరం వద్దకు భారీగా తరలివచ్చారు.
బెలూన్లు ఎగరవేసిన రాజధాని రైతులు, సమర సంక్రాంతి పేరిట వినూత్న నిరసన తెలిపారు. అమరావతి పరిరక్షణ సమితి ఐకాస ఆధ్వర్యంలో తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద మహిళలు పొంగళ్లు పెట్టారు. సేవ్ అమరావతి - సేవ్ ఆంధ్రప్రదేశ్ అని బెలూన్లపై రాసి వాటిని గాల్లోకి ఎగురవేశారు. అమరావతిపై దుష్ప్రచారాలను నిరసిస్తూ గాలి పటాలు ఎగరవేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పండగలూ రోడ్డుపైనే చేసుకోవాల్సి వస్తోందని రాజధాని రైతులు వాపోయారు.