శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 జనవరి 2021 (12:54 IST)

నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు హై సెక్యూరిటీ.. పోలీసుల సెలవులు రద్దు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. మొత్తం నాలుగు దశల్లో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనరుగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే, విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంతో పాటు.. నిమ్మగడ్డ నివాసాల వద్ద భద్రతా బలగాల సంఖ్యను పెంచారు. ముఖ్యంగా, ఎన్నికల కార్యాలనికి వచ్చే ప్రతి వ్యక్తితో పాటు.. వాహనాన్ని నిశితంగా తనిఖీ చేస్తున్నారు. తన ప్రాణానికి ముప్పు పొంచివుందని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌కు నిమ్మగడ్డ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇంటివద్ద 24 గంటల పాటు సెక్యూరీటీ బలగాలు విధులు నిర్వహించనున్నాయి. 
 
మరోవైపు, ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసుశాఖలోని అన్ని విభాగాల సిబ్బందికీ.. సాధారణ సెలవులు, వారాంతపు సెలవుల్ని రద్దు చేస్తున్నట్లు శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్ ఆదేశాలు జారీ చేశారు. 
 
బుధవారం నుంచి ఫిబ్రవరి 21వరకు సెలవుల రద్దు అమల్లో ఉంటుందని తెలిపారు. నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహణ జరుగుతుందని.. ఆరోగ్య రీత్యా , అత్యవసర పరిస్థితుల్లో వారాంతపు సెలవును పరిగణలోకి తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు.