శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: శుక్రవారం, 23 జులై 2021 (21:30 IST)

బెయిల్ వ‌చ్చిన వెంట‌నే బ‌య‌ట‌కు పంపండి

ఎలాంటి నిందితుల‌కైనా బెయిల్ మంజూర‌యిన వెంట‌నే జైలు నుంచి బ‌య‌ట‌కు పంపాల‌ని హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 26 నుంచే ఈ మార్గదర్శకాలు అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని జస్టిస్‌ కె.లలిత ఉత్త‌ర్వులు జారీ చేశారు. 
 
ఇటీవ‌ల సుప్రీం ఛీఫ్ జ‌స్టిస్ ఎన్ వి ర‌మ‌ణ బెయిల్ పేప‌ర్స్ పావురాల‌తో పంపాలా అని కామెంట్ చేసిన సంగ‌తి తెలిసింది. దానికి అనుగుణంగా మేధోమ‌ధ‌నం న్యాయ వ‌ర్గాల్లో జ‌రిగింది. అండర్‌ ట్రయల్‌ ఖైదీలు, నిందితులను న్యాయస్థానాలు బెయిల్‌పై విడుదల చేశాక, ఎలాంటి ఆలస్యం లేకుండా వారు విడుదలయ్యేందుకు హైకోర్టు కొత్త విధానాన్ని రూపొందించింది. అందుకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలిత గురువారం కీలక తీర్పు ఇచ్చారు.
 
హైకోర్టు రిజిస్ట్రీ సర్టిఫైడ్‌ ఆర్డర్‌ కాపీలు వేగంగా జారీ చేసేందుకు కృషి చేస్తున్నప్పటికీ.. కాపీలు అందించడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు కోర్టు దృష్టికి వచ్చింది. పెద్ద సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉండడం, సిబ్బంది కొరత కారణంగా తక్కువ సమయంలో ఆర్డర్‌ కాపీలు జారీ చేయడం కష్టంగా మారింది.

జైల్లో ఉన్న నిందితులు చట్టబద్ధంగా బెయిల్‌ పొందిన తరువాత కూడా ఆర్డర్‌ కాపీని పంపడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని కోర్టు దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో అండర్‌ ట్రయల్‌ ఖైదీలు, నిందితుల అవస్థలను పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ యంత్రాంగం అవసరమని కోర్టు భావిస్తోంది. ఇటీవల గౌరవ సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది.

వ్యక్తుల స్వేచ్ఛను కాపాడటం కోర్టుల రాజ్యాంగబద్ధ విధి. నిందితుల హక్కుల పరిరక్షణకు మన నేర న్యాయవిచారణ వ్యవస్థ అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. ప్రక్రియ వేగంగా ఉన్నప్పుడే న్యాయాన్ని వేగంగా అందించగలం. వ్యక్తిగత స్వేచ్ఛను అధికరణ 21 పరిరక్షిస్తుంది. ఆ హక్కు నిరాకరణకు గురైతే ప్రజల్లో న్యాయవ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లుతుంది. బెయిల్‌ పిటిషన్లు నిర్ణీత సమయంలో పరిష్కరించాల్సిన హక్కు నిందితులకు ఉంటుంది. ఏపీ హైకోర్టు కోర్టు ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను, తీర్పులను అదే రోజు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు.