శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 1 ఆగస్టు 2014 (11:13 IST)

తల్లితో వివాహం... కూమార్తెకు లైంగిక వేధింపులు: క్రైమ్ రిపోర్టర్ అరెస్టు!

పశ్చిమ గోదావరిలో కామాంధుడిగా మారిన ఓ క్రైమ్ రిపోర్టర్ జైలుపాలయ్యాడు. ఓ ఎన్.ఆర్.ఐ మహిళకు మాయ మాటలు చెప్పి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమె కుమార్తెపై కన్నేసి లైంగిక వేధింపులకు పాల్పడుతూ ఇపుడు పోలీసుల చేతికి చిక్కి జైలుపాలయ్యాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన రబ్బ రవివర్మ (45) రామంతాపూర్‌లోని దూరదర్శన్‌కాలనీలో భార్యపిల్లలతో కలిసి ఉంటున్నాడు.
 
గతంలో ఈయన ఓ న్యూస్ మ్యాగ్‌జైన్‌కు క్రైం రిపోర్టర్‌గా కూడా పని చేశాడు. ఆ సమయంలో విశాఖపట్నానికి చెందిన ఉమామహేశ్వరితో పరిచయమై ఫోన్, ఇంటర్‌నెట్ ద్వారా మాట్లాడుకొనేవారు. తనకు ఓ ప్రాజెక్ట్ వచ్చిందని, దాన్ని పూర్తి చేస్తే రూ.500 కోట్లు వస్తాయని, ఇందుకు తనకు కొంత డబ్బు కావాలని మహేశ్వరితో అన్నాడు. ఆమె యూఎస్‌లో ఉంటున్న తన మిత్రురాలు రాగలక్ష్మికి విషయం చెప్పి, ఇద్దరిని చాటింగ్ ద్వారా కలిపింది.
 
భర్తతో విడాకులు తీసుకుని ఇద్దరు పిల్లలతో యూఎస్‌లో ఉంటున్న రాగలక్ష్మి.. రవివర్మ మాటలు నమ్మి 50 వేల యూఎస్ డాలర్లు (సుమారు రూ.23 లక్షలు) పంపింది. ఈ క్రమంలో తరచూ మాట్లాడుకోవడంతో ఇద్దరి మధ్య అనుబంధం పెరిగింది. 2013లో పిల్లలతో కలిసి ఇండియా వచ్చిన రాగలక్ష్మిని అతను పెళ్లి చేసుకున్నాడు. తర్వాత రాజమండ్రిలో ఇల్లు అద్దెకు తీసుకొని కొన్నిరోజులున్నారు. రాగలక్ష్మి తన కుమార్తె(14)ను నగరంలోని సోదరి నాగదేవి ఇంటి వద్ద ఉంచి, కొడుకును తీసుకొని యూఎస్ వెళ్లిపోయింది. రవివర్మ తరచూ నాగదేవి ఇంటికి వెళ్లి.. వరుసకు కుమార్తె అయిన బాలికతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. 
 
ఈ ఏడాది జూన్‌లో నగరానికి వచ్చిన రాగలక్ష్మి, రవివర్మ పిల్లలతో కలిసి నేపాల్ వెళ్లింది. అక్కడ రవివర్మ ప్రవర్తనపై ఆమెకు అనుమానం కలిగింది.  నేపాల్ నుంచి వచ్చి కుమార్తెను సీతాఫల్‌మండి మేడిబావిలోని మరోసోదరి స్నేహదేవి ఇంట్లో ఉంచి యూఎస్ వెళ్లిపోయింది. జూలై 27న స్నేహదేవి ఇంటికి వచ్చిన రవివర్మ బాలికను లైంగికంగా వేధించసాగాడు. ఎవరికైనా చెబితే పాస్‌పోర్టు చింపేస్తానని, తల్లిని కలవకుండా చేస్తానని బెదిరించాడు. బాలిక విషయాన్ని పిన్ని స్నేహాదేవికి చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం రవివర్మను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.