గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By మోహన్
Last Modified: మంగళవారం, 29 జనవరి 2019 (19:21 IST)

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి 1000 మంది యువకుల్లో 194 మంది అవివాహితులుగా ఉండాల్సిందేనా??

గత కొన్ని దశాబ్దాలుగా పురుషుల శాతం కంటే మహిళల శాతం తగ్గుతూ వస్తోంది. ఇందుకు అనేక కారణాలూ లేకపోలేదు. వాటిల్లో ముందుగా మగశిశువు జన్మిస్తే ఆనందించడం, ఆడ శిశువు పుట్టగానే ఏడుపు ముఖాలు వేసుకుని, అమ్మాయిని పురిట్లో చంపేసిన సందర్భాలు కోకొల్లలు. దాని ఫలితంగానే ప్రస్తుతం ప్రతి 1000 మంది అబ్బాయిలకు గానూ దేశంలో అత్యల్పంగా ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో 806 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నట్లు జనాభా లెక్కలు చెప్తున్నాయి. 
 
అయితే ఈ సంఖ్య మరింత తగ్గితే అనేకమంది పురుషులు బ్రహ్మచర్యంతోనే జీవితాలను ముగించవలసి రావచ్చు. ప్రస్తుతానికి ఆడశిశువు పట్ల వివక్ష చాలావరకు తగ్గింది. ఆడ, మగ అని భేదాలు లేకుండా ఇప్పుడు అందరినీ సమానంగా చూస్తున్నారు. ఈ నిష్పత్తి పెరిగే అవకాశాలు మరింత ఎక్కువగానే ఉన్నాయి. గతంలో అమ్మాయిల కట్నకానుకల విషయాలకు ఆస్తులు అమ్మిన సందర్భాల్లో నుండి ప్రస్తుతం వారికి ఎదురుకట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటున్నారు. 
 
ఇప్పుడు కన్యాశుల్కం మళ్లీ వచ్చినట్లు అనిపిస్తోంది. వీటిపై పోరాడేందుకు ఏ గురజాడ అప్పారావు రానక్కర్లేదు కానీ మనుషుల్లో, అలాగే వారి మనసుల్లో మహిళల పట్ల వివక్ష తగ్గినప్పుడు మాత్రమే వారి సంఖ్య పెరిగి లింగ సమతుల్యత వచ్చే అవకాశాలు వస్తాయి. మరోవైపు మహిళల పట్ల అఘాయిత్యాలు పెరగడం కూడా వారి సంఖ్య తగ్గుముఖం పట్టడానికి కారణం అవుతుంది.