సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (09:00 IST)

కర్నూలు విమాన ప్రయాణికులకు ట్యాక్సీల కొరత

కర్నూలు విమానాశ్రయంలో విమాన రాకపోకలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రయాణికులు అక్కడి నుంచి గమ్య స్థానాలకు చేరుకునేందుకు ట్యాక్సీలు లేక పడరాని పాట్లు పడాల్సి వస్తోంది. 
 
 ఇక్కడి నుంచి బెంగళూరు, విశాఖపట్టణం, చెన్నై నగరాలకు విమాన సర్వీసులు తిప్పుతున్నారు.  విమానాల్లో వచ్చే ప్రయాణికులు ఇక్కడ దిగిన తర్వాత స్థానికంగా ట్యాక్సీలు లేకపోవటంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. 

ఇదే అదునుగా తీసుకుని ప్రైవేటు వాహనదారులు విమానాశ్రయం నుంచి(కేవలం మూడు కిలోమీటర్లకు) జాతీయ రహదారి వరకు మనిషికి రూ.వంద చొప్పున వసూలు చేస్తున్నారు.  అదే కర్నూలు వరకైతే రూ.500 నుంచి రూ.700 వసూలు చేస్తున్నారు. 
 
రోజుకు 200 నుంచి 250 మంది ఇక్కడి నుంచి విమాన యానం చేస్తున్నారు.  గగన ప్రయాణం సజావుగా సాగినా ఇక్కడ దిగిన తర్వాత మాత్రం ట్యాక్సీలు లేక చుక్కలు చూడాల్సి వస్తోంది. 
 
 మంగళవారం చెన్నై నుంచి సాయంత్రం 4.10 గంటలకు వచ్చిన విమానంలో 15 మంది ప్రయాణికులు దిగారు. ఇక్కడి నుంచి 4.30 గంటలకు చెన్నైకి వెళ్లిన ఫ్లైట్‌లో 30 మంది వెళ్లారు.
 
ఇక్కడ దిగిన ప్రయాణికులు ట్యాక్సీలను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే వీలు లేకపోవడంతో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.  స్థానికంగా రవాణా వాహనాలు ఉంటాయనుకున్నవారు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. 
 
ప్రధాన నగరాల్లో కొన్ని సంస్థలు తక్కువ ధరలకే ప్రైవేటు వాహనాలను తిప్పుతున్నాయి. ఇక్కడ ఇంకా ఆ అవకాశాలు అందుబాటులోకి రాలేదు. 
 
ఈ క్రమంలో కర్నూలు నుంచి విమానాశ్రయానికి నియమిత వేళల్లో ఆర్టీసీ బస్సులు నడిపే అవకాశాన్నీ పరిశీలించాల్సి ఉందని పలువురు కోరుతున్నారు. 
 
 అందరికీ సొంత వాహనాలు ఉండవు. విమానాశ్రయానికి వెళ్లాలన్నా... అక్కడి నుంచి సొంత గ్రామాలకు చేరుకోవాలన్నా విమాన ఖర్చులకన్నా ఎక్కువ పెట్టాల్సి వస్తోందని జిల్లావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.