ఏపీ లిక్కర్ కేసు : ఎంపీ మిథున్ రెడ్డిని కస్టడీకి ఇవ్వండి : సిట్ పిటిషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసిన మద్యం స్కామ్‌లో సిట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నాలుగో నిందితుడుగా రాజమండ్రి జైలులో జ్యూడీషియల్ రిమాండ్‌లో ఉన్న మిథున్ రెడ్డి వద్ద విచారణ జరిపేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని ప్రత్యేక దర్యాప్తు బృందం కోరింది. ఈ మేరకు సిట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
మద్యం స్కామ్‌కు సంబంధించిన కీలక సమాచారం రాబట్టేందుకు మిథున్ రెడ్డిని ఐదు రోజుల పాటు తమ విచారణకు అనుమతించాలని సిట్ అధికారులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంటున్న విషయం తెల్సిందే.
కాగా, ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు లోక్‌సభ్యుడైన మిథున్ రెడ్డికి కోర్టును ఆశ్రయించగా ఆయనకు షరతులతో కూడిన అనుమతిని కోర్టు ఇచ్చింది. ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత సెప్టెంబరు 11వ తేదీన సాయంత్రం 5 గంటలలోపు తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలులో లొంగిపోవాలని కోర్టు ఆదేశించడంతో తిరిగి ఆయన కోర్టులో లొంగిపోయారు.
మరోవైపు, ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఐఏఎస్ విశాంత అధికారి ధనుంజయ్ రెడ్డి, మాజీ సీఎం జగన్‌కు ఓఎస్డీగా పని చేసిన కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలకు కోర్టు గతంలోనే షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెల్సిందే.
అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి మాత్రం బెయిల్ ఇవ్వలేదు. పైగా, ఆయనకు చెందిన నగలు, ఆస్తులను ఇప్పటికే జప్తు చేశారు. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డిని కస్టడీకి కోరుతూ సిట్ పిటిషన్ దాఖలు చేయడం ఇపుడు ఆసక్తికరంగా మారింది.