శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (11:27 IST)

పుస్తకమై వెలిగిన బాహుబలి పాత్ర.. తెలుగులో విడుదలైన 'శివగామి కథ'. డోంట్ మిస్

బాహుబలి సినిమా మూలస్థంబాల్లో అతి పెద్ద మూలస్తంభం శివగామి. నా మాటే శాసనం అంటూ రమ్యకృష్ణ గర్జిస్తుంటే, మాహిష్మతి రాజ్యానికి పట్టిన మకిలిని చెరిపేయ్ అంటూ ఆజ్ఞాపిస్తుంటే.. యుద్ధంలో వందమంది శత్రువులను చంపి

బాహుబలి సినిమా మూలస్థంబాల్లో అతి పెద్ద మూలస్తంభం శివగామి. నా మాటే శాసనం అంటూ రమ్యకృష్ణ గర్జిస్తుంటే, మాహిష్మతి రాజ్యానికి పట్టిన మకిలిని చెరిపేయ్ అంటూ ఆజ్ఞాపిస్తుంటే.. యుద్ధంలో వందమంది శత్రువులను చంపితే వీరుడంటారు. అదే పదిమంది ప్రాణాలు కాపాడితే దేవుడంటారు అంటూ ఉదాత్తస్వరంలో అమరేంద్ర బాహుబలిని  రాజుగా ప్రకటిస్తుంటే..దశాబ్దాల తర్వాత భారతీయ చలనచిత్రరంగం మహిళ ఔద్ధత్యాన్ని శిఖర స్థాయిలో నిలిపిన పాత్ర శివగామి. రమ్యకృష్ణ ఆ పాత్ర పోషించకుంటే బాహుబలి ఇంత సక్సెస్ సాధించేది అన్నా అనుమానమే. రాజమౌళి అంతటి మాంత్రిక దర్శకుడే రమ్యకృష్ణకు బహిరంగంగానే దండం పెట్టేశారు. 
 
శివగామి పాత్రకు రమ్యకృష్ణ ఎంత ప్రాణప్రతిష్ట పోశారంటే సింహాసనం గద్దెపై శివగామి కూర్చోవడం, ఒక్కో డైలాగ్ సంధించడం చూసిన ప్రధాన హీరోయిన్ అనుష్కకు చమటలు పట్టాయట. ఆమె ముందు తను డైలాగులు చెప్పాల్సి వస్తుందన్న ఆలోచన రాగానే ముందుగా వణికిపోయానని అనుష్క స్వయంగా చెప్పింది.  రెండు చేతులు ఊపేస్తూ ఇక మమ్మల్నెవరూ చూడరు, మా డైలాగులను ఎవరూ వినరు అంటూ భయపడిపోయింది అనుష్క. దర్బారులో శివగామి కూర్చుని డైలాగులు సంధిస్తుంటే పోటీగా ఎలా డైలాగులు చెప్పడం అంటూ రాజమౌళికే మొరపెట్టుకున్నారు అనుష్క. కేవలం రాజమౌళి ఇచ్చిన కంపర్ట్‌తోనే నేను శివగామి ముందు నిలిచి డైలాగులు చెప్పగలిగాను అన్నారు అనుష్క
 
ఇక ప్రభాశ్ అయితే శివగామి పాత్రను ఆకాశానికి ఎత్తేశాడు. అంత శక్తివంతమైన పాత్రను, ఆమె నటనను ఎక్కడా చూడలేదనేశాడు. శివగామి పాత్రకు అసాధారణమైన నటీమణుల పేర్లను కూడా విన్నాం. వారందరి పేర్లూ విన్నాక చివరలో రమ్యకృష్ణను శివగామి పాత్రకు ఎంపిక చేశారని వినగానా రాజమౌళి సెలెక్షన్ కదా మంచి నిర్ణయమే అనుకున్నాము కానీ అత పెద్ద ఉద్వేగాన్ని ఫీలవలేదు. కానీ షూటింగ్‌లోకి వచ్చి ఆమెను ఆమె పెద్దబొట్టును, ఆమె కూర్చున్న విధానం  చూడగానే అబ్బ అనిపించింది. ఈమెను కొట్టేవాళ్లు లేరు అనుకున్నాం. ఆవిడ కళ్లు, కళ్లలో ఆ శక్తి ఎవ్వరం ఊహించలేదు. అనేశాడు ప్రభాస్.
 
ఇక బిజ్జలదేవ పాత్రధారి నాజర్ అయితే శివగామి పాత్రను, రమ్యకృష్ణ నటనను చూసిన తర్వాత జీవితంలో తొలిసారిగా ఆడదానిగా పుట్టాలనిపించింది అనేశారు. అలాగైనా శివగామి పాత్ర తాను వేసి ఉండేవాడిని కదా అనే దుగ్ధ నాజర్‌ది.
 
ఇండియన్ సినిమాలో ఇంత శక్తివంతమైన పాత్ర ఇంతకు ముందెన్నడూ చూడలేదు, రాలేదు అనిపించిన శివగామి రాజమౌళిని వెంటాడుతోంది. తనకు శివగామి నేపథ్యం గురించి పుస్తకం రాయాలని ఉంది అని ప్రముఖ మలయాళి రచయిత ఆనంద్‌ నీలకంఠన్‌ ఒక సందర్భంలో చెప్పినప్పడు అయన్ని ఎంతగానో ప్రోత్సహించారు రాజమౌళి. ఆనంద్ విడతలుగా పుస్తకం భాగాలు పంపుతుంటే తర్వాయి భాగాలకు నేనిక వెయిట్ చేయలేను అని వ్యాఖ్యానించారు రాజమౌళి. గత సంవత్సరం జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌లో ఆనంద్ నీలకంఠన్ రాసిన ‘ద రైజ్‌ ఆఫ్‌ శివగామి’ పుస్తకాన్ని ఆవిష్కరించినప్పుడు సంచలనం కలిగింది. కొన్ని వందల ప్రతులను అక్కడికక్కడే కొనేశారు. స్వయంగా జైపూర్ లిటేరేచర్ పెస్టివల్‌కి వెళ్లిన రాజమౌళి తనలోని సాహిత్యకారుడిని, అధ్యయన జిజ్ఞాసను తొలిసారి బయటపెట్టారు. 
 
ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే ఆనంద్ ఆనంద్ నీలకంఠన్ రాసిన ‘ద రైజ్‌ ఆఫ్‌ శివగామి’ పుస్తకం తెలుగు అనువాదం శివగామి కథ ప్రచురితమైంది. వేమూరి రమాంజనీ కుమారి దీన్ని తెలుగులోకి అనువదించారు. అమెజాన్‌üలో ఈ పుస్తకం లభ్యమవుతోంది.
 
బాహుబలి ఫ్రాంఛైజ్‌లో భాగంగా యానిమేషన్స్‌, టీవీ సిరీస్‌, పుస్తకాలు ఇలా ఆ ప్రపంచాన్ని అనేక రూపాల్లో తీసుకొస్తామని దర్శక నిర్మాతలు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అలా బాహుబలి పాత్రల్లో పుస్తక రూపంలోకి వచ్చిన తొలి పాత్ర కూడా శివగామిదే కావడం మరీ విశేషం. 
 
బాహుబలి పాత్రలు ఎంతో బలమైన భావోద్వేగాలతో ముడి పడి ఉండటంతో అవి ప్రేక్షకులపై చెరగని ముద్రను వేశాయి. వాటిలో ఒకటైన శివగామి ప్రస్తుతం తెలుగులో పుస్తకమైంది. 
 
ఆసక్తి ఉన్నవారు అమెజాన్‌లో ఈ తెలుగు పుస్తకం కోసం ఆర్డర్ పెట్టవచ్చు.