మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 25 ఆగస్టు 2021 (11:00 IST)

చేతి వేళ్లతో కాదు... ముఖ కవళికలతోనే స్మార్ట్‌ ఫోన్ ఆపరేటింగ్

స్మార్ట్ ఫోన్ వ‌చ్చిన కొత్త‌లో చాలా బాగుండేది. ఎంచ‌క్కా అంతా ఫింగ‌ర్ టిప్స్ లో ఆండ్రాయిడ్ ఫోన్లు ఆప‌రేట్ చేసే వాళ్ళు. కానీ, ఇపుడు ఆ ఫోన్ చేతి వేళ్ళ‌తో ట‌చ్ స్క్రీన్ ఆప‌రేట్ చేయ‌డం కూడా విసుగు అనిపించేస్తోంది. దీనికి నివార‌ణ‌గా ఇపుడు కొత్త టెక్నాల‌జీ అందుబాటులోకి వ‌చ్చేస్తోంది.
 
స్మార్ట్ ఫోన్లను ఇప్పటి వరకు చేతి వేళ్లతో ఆపరేట్ చేస్తుండగా, ఇకపై ముఖ కవళికలు, సంజ్ఞలతోనే దానిని నియంత్రించే వెసులుబాటు రాబోతోంది. టెక్ దిగ్గజం గూగుల్ నుంచి త్వరలో రాబోతున్న ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌లో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గూగుల్ నిమ‌గ్నం అయింది.
 
ఇందులోని యాక్సెసిబిలిటీ ఫీచర్ సాయంతో సంజ్ఞలతోనే ఫోన్‌ను నియంత్రించవచ్చు. ఇందులో భాగంగా ‘కెమెరా స్విచెస్ ఫీచర్’ను రాబోయే ఆండ్రాయిడ్ 12 వెర్షన్‌లో డెవలప్ చేస్తోంది. దీని ద్వారా ముఖ కవళికలతోనే స్మార్ట్‌ఫోన్‌ను ఆపరేట్ చేసుకోవచ్చు. అంటే,నోరు తెరవడం, కుడి ఎడమలకు, కిందికి చూడడం వంటి వాటితోనే ఫోన్‌ను నియంత్రించే వీలు కలుగుతుంది.
 
హోమ్ పేజీకి వెళ్లడం, వెనుకకు, ముందుకు స్క్రోల్ చేయడం, సెలక్ట్ చేసుకోవడం వంటివి కూడా ఈ ఫీచర్‌లో ఉంటాయి. అలాగే, సంజ్ఞ పరిమాణం, వ్యవధిని కూడా ఎడ్జెస్ట్ చేసుకునేందుకు ఈ యాప్ వినియోగదారులను అనుమతిస్తుంది. ప్రస్తుతం ఈ సౌకర్యం బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది.

వైకల్యాలతో ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు ఇది చక్కగా ఉపయోగపడుతుందని గూగుల్ పేర్కొంది. ఇంకే... త్వ‌ర‌లో ఆ సౌక‌ర్యం కూడా అందుబాటులోకి వ‌చ్చేస్తోంద‌న్న‌మాట‌.