శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 6 జనవరి 2019 (16:27 IST)

ప్రతి ఇంటికి ఓ స్మార్ట్ ఫోన్ .. సొంతింటి కల నెరవేర్చుతాం : చంద్రబాబు

ప్రతి ఇంటికి ఓ స్మార్ట్ ఫోన్ ఇస్తామని, అలాగే, సొంతింటి కల నెరవేర్చుతామని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కృష్ణా జిల్లా పునాదిపాడులో జరిగిన జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఇప్పటికే పట్టణాల్లో 30 లక్షలకు పైగా గృహాలను నిర్మించినట్టు చెప్పారు. అలాగే, జీ ప్లస్ త్రీ విధానంలో రెండు పడకల గదుల ఇళ్ళను నిర్మిస్తామని వెల్లడించారు. 
 
త్వరలో ప్రతి ఇంటికి స్మార్ట్ ఫోన్ ఇచ్చే పథకానికి శ్రీకారం చుడతామన్నారు. భవిష్యత్‌లో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని స్పష్టంగా చెప్పామని, సహజ వనరులను కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపై ఉందని అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో కృష్ణా జిల్లా ప్రథమస్థానంలో ఉందని, అభివృద్ధిలో ఏపీని ప్రపంచంలోనే నమూనా రాష్ట్రంగా తయారు చేయాలన్నదే తన లక్ష్యమన్నారు. సహజవనరులు, అవకాశాలను వినియోగించుకోవడంలో పునాదిపాడు ఆదర్శమని, కాలువ గట్లపై ఇల్లు కట్టుకున్న వారికి కోరుకున్న చోట ఇళ్లు కట్టిస్తామన్నారు. 
 
బ్యాంకులను మోసం చేసి దేశం వీడి పారిపోయిన వాళ్ళను ఇపుడు పట్టుకునివస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారంటూ దుయ్యబట్టారు. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన కేంద్రం.. ఆ పని చేయకుండా రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేలా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. చివరకు రాష్ట్రాభివృద్ధి నిమిత్తం తాను దావోస్ పర్యటనకు వెళ్తుంటే తనపై ఆంక్షలు పెట్టి అడ్డుకోవాలని చూశారని, విదేశాలకు వెళ్లి రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించడం తప్పా? అని ప్రశ్నించారు.