శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (10:32 IST)

కోడెలకు కోపమొచ్చింది: నా బాధ్యతలను ఎవ్వరూ గుర్తుచేయాల్సిన అవసరం లేదు!

అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రెడ్డి విపక్ష నేతలపై మండిపడ్డారు. కోపంతో ఊగిపోయారు. అసెంబ్లీలో తాను ఎవ్వరికీ అనుకూలంగా వ్యవహరించట్లేదని, నిబంధనల ప్రకారమే సభ నడుపుతున్నానని కోడెల అన్నారు. అసెంబ్లీలో అధికార పక్షానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో, విపక్షాలకూ అంతే ప్రాధాన్యత ఇవ్వాలని, ముఖ్యమైన అంశాలపై చర్చకు వెంటనే అనుమతించాలని పట్టుబడుతూ, పోడియంలోకి దూసుకొచ్చిన వైకాపా సభ్యులపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
తన బాధ్యతలు తనకు తెలుసునని, వాటిని ఎవరూ గుర్తు చేయాల్సిన అవసరం లేదని కాస్తంత ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఏం చేయాలో విపక్ష సభ్యులు తనకు చెప్పాల్సిన పని లేదన్నారు. అసెంబ్లీలో అందరికీ అవకాశం వస్తుందని, అప్పుడు మాత్రమే మాట్లాడాలని కోరారు. జగన్ మాట్లాడుతుంటే మాత్రం తమ స్థానాల్లో కూర్చునే వైకాపా సభ్యులు, మరెవరు మాట్లాడుతున్నా వెల్‌లోకి దూసుకురావడం సమంజసం కాదన్నారు. సభా మర్యాదలు పాటించాలని విపక్ష సభ్యులకు కోడెల సూచించారు.