గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 ఏప్రియల్ 2020 (11:30 IST)

లాక్‌డౌన్ ఎఫెక్ట్‌.. కుమార్తె పెళ్లి ఆగిపోతుందని తండ్రి మృతి

లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా కూతురి పెళ్లి ఆగిపోయిందనే మనస్తాపంతో ఓ తండ్రి గుండెపోటుతో మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లాలోని మందసకు చెందిన వెంకటరావు అనే వ్యక్తి కూతురు పెళ్లి ఆగిపోతుందన్న బెంగతో గుండెపోటుకు గురై బుధవారం ప్రాణాలు కోల్పోయాడు. 
 
మందస మండలంలోని పిడిమందసకు చెందిన వెంకటరావు వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడి కుమార్తె వివాహం కోసం వెంకటరావు వివాహ శుభలేఖలు పంచేందుకు విశాఖపట్నంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. లాక్‌డౌన్‌ కారణంగా తిరిగి ఇంటికి వెళ్లే అవకాశం లేక విశాఖపట్నంలోనే చిక్కుకున్నారు. అటు, వరుడి తల్లి కూడా బంధువులకు శుభలేఖలు పంచేందుకు హైదరాబాదు వెళ్లి అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.
 
ముహూర్తం దగ్గరపడడంతో కుమార్తె పెళ్లి ఆగిపోతుందనే బెంగతో వెంకటరావుకు గుండెపోటు వచ్చింది. దీంతో బంధువులు అతడిని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.