వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు, వైఎస్ ఆర్ క్రిస్టియన్ పార్టీ.. స్వామీజీ సంచలన వ్యాఖ్యలు
ఎపి సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానందసరస్వతి ఎపి సిఎంపైనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి రైతులకు సంఘీభావం తెలిపేందుకు తిరుపతికి వచ్చిన స్వామీజీ నిన్న వారితో కలిసి పాదయాత్రగా నడిచారు. పాదయాత్రలో రైతులకు వస్తున్న స్పందన చూసి సంతోషం వ్యక్తం చేశారు.
పాదయాత్ర తరువాత వైసిపి ప్రభుత్వం పడిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో పాటు ఎపి సిఎంపైనా విరుచుకుపడ్డారు. చేతకాని పాలన వల్ల జనం ఆగ్రహంతో ఉన్నారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు.. వైఎస్ఆర్ క్రిస్టియన్ పార్టీ అంటూ మండిపడ్డారు.
వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనాలోచిత నిర్ణయాలతో, వ్యక్తిగత స్వార్థంతో భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా టిటిడి పాలకమండలి వ్యవహరిస్తోందన్నారు. టిటిడి ట్రస్టు బోర్డు హిందూ పీఠాధిపతులు, ధర్మచార్యుల సలహాలు సూచనలను తీసుకోకుండా టిటిడి యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిపై వెంటనే ధర్మాచరణ సదస్సును నిర్వహించాలని లేని పక్షంలో తామే టిటిడిలోని అవకతవకలపై సదస్సు నిర్వహిస్తామన్నారు. శ్రీవారి ప్రసాదాలను, దర్సనాలను, విడిది గదుల రేట్లను పెంచి దోపిడీ పాలన సాగిస్తోందన్నారు.
గతంలో లక్ష మంది భక్తులు రోజుకు శ్రీవారిని దర్సనం చేసుకుంటే నేడు అది కాస్త పదివేలకు కుదించేశారన్నారు. కరోనా సాకుతో కుదించడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చాక హిందూ మతంపై దాడి జరుగుతోందని.. హిందూ మతాన్ని కాపాడుకునేందుకు ఎంత దూరమైనా వెళతామన్నారు.