శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (11:32 IST)

సొంత జిల్లాలో స్టీల్ ప్లాంట్‌పై చేతులెత్తేసిన జగన్ సర్కారు.. అసెంబ్లీ చర్చ!

buggana
తన సొంత జిల్లా కడపలో నెలకొల్పతలపెట్టిన కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం విషయంలో ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి చేతులెత్తేశారని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం ఆరోపించింది. దీనికి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గట్టిగానే సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తూ, ప్లాంట్ ఏర్పాటు చేయకపోవడానికి కరోనా మహమ్మారి అంటూ సెలవిచ్చారు. 
 
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై టీడీపీ లేవనెత్తిన ప్రశ్నపై అసెంబ్లీలో వాడివేడీగా చర్చ జరిగింది. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్ళవుతున్నా ఇంతవరకు కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టలేదని విమర్శించారు. సొంత జిల్లాలోని ప్లాంట్ నిర్మాణాన్ని కూడా ఆయన పట్టించుకోలేదని ఆరోపించారు. 
 
దీనికి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. కరోనా వల్ల ప్రపంచమే కుదేలైందని, స్టీల్ పరిశ్రమ పూర్తిగా డౌన్ అయిందన్నారు. కరోనాతో రెండేళ్లు గడిచిపోయాయని చెప్పారు. ఈ విషయాలు తెలుసుకోకుండా టీడీపీ నేతలు విమర్శిస్తున్నారంటూ మండిపడ్డారు.