గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: మంగళవారం, 24 అక్టోబరు 2017 (13:30 IST)

విద్యార్థుల ఆత్మహత్యలను అడ్డుకోండి... మహిళలపై దాడులను అణిచివేయండి..

అమరావతి : చదువుల ఒత్తిళ్ల కారణంగా చోటుచేసుకుంటున్న విద్యార్థుల మరణాలను అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశించారు. ఇందుకోసం 13 జిల్లాల కలెక్టర్లు తమ జిల్లాల్లో ఉన్న కళాశాలలు, విద్యా సంస్థలను తనిఖీ చేయాలని, మార్కులు, ర్యా

అమరావతి : చదువుల ఒత్తిళ్ల కారణంగా చోటుచేసుకుంటున్న విద్యార్థుల మరణాలను అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశించారు. ఇందుకోసం 13 జిల్లాల కలెక్టర్లు తమ జిల్లాల్లో ఉన్న కళాశాలలు, విద్యా సంస్థలను తనిఖీ చేయాలని, మార్కులు, ర్యాంకులంటూ విద్యార్థులపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఒత్తిళ్లు తీసుకురాకూడదని ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలను హెచ్చరించాలని అన్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై నెలవారీ సమీక్షలో భాగంగా 13 జిల్లాల కలెక్టర్లతో సీఎస్ దినేష్ కుమార్ తన కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
 
ముందుగా ప్రభుత్వ పథకాల అమలులో ఆయా జిల్లాల పనితీరును రాష్ట్ర ప్లానింగ్ కార్యదర్శి సంజయ్ గుప్తా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లాల వారీగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ సమీక్షించారు. శ్రీకాకుళం జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందజేస్తున్నరుణాల పంపిణీ నత్తనడకగా సాగడంపై ఆ జిల్లా కలెక్టర్ ను ప్రశ్నించారు. తక్షణమే లబ్ధిదారులను గుర్తించి, యూనిట్లు గ్రౌండయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విశాఖ జిల్లాలో సీసీ రోడ్ల నిర్మాణం నత్తనడక సాగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 
 
రోడ్ల నిర్మాణంపై నిర్లక్ష్యం చూపొద్దన్నారు. జిల్లాలో క్రైమ్ రేట్ అదుపునకు పోలీసులతో కలిసి చర్యలు తీసుకోవాలని ఆ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లాలో పంట కుంటల తవ్వకాలు ఆశించిన మేర జరగడంలేదన్నారు. రైతుల్లో అవగాహన కల్పించి, ఈ ఏడాది నిర్ధేశించిన లక్ష్యం మేర పంటకుంటల తవ్వకాలు చేపట్టాలని ఆదేశించారు. ఏజెన్సీల్లో తాగునీటి పథకాల నిర్మాణంలో జాప్యం చేసుకోకూడదన్నారు. ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా మన్యంలో చేపట్టిన తాగునీటి పథకాలన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. 
 
తూర్పు గోదావరి జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల భవనాల నిర్మాణాలు శరవేగంగా సాగుతుండడంపై సీఎస్ సంతృప్తి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏజెన్నీ ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న మాతా శిశు మరణాల నిరోధానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం జాప్యం చోటుచేసుకుంటోందన్నారు. వచ్చే జనవరిలోగా పంచాయతీ భవన నిర్మాణాలు పూర్తి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. జిల్లాలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా సాగడంపై సీఎస్ దినేష్ కుమార్ అభినందించారు. 
 
కృష్ణా జిల్లాలో ఆశించిన స్థాయిలో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు జరగడం లేదన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వాటి నిరోధానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతంను ఆదేశించారు. ప్రకాశం జిల్లాలో గ్రామ పంచాయతీ భవనాలు శరవేగంగా సాగడంపై సీఎస్ దినేష్ కుమార్ అభినందించారు. మైక్రో ఇరిగేషన్ అమలులో జిల్లా వెనుకబడి ఉందన్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం చూపొద్దన్నారు. అర్హులను గుర్తించి ఎస్సీ, ఎస్టీ రుణాలను త్వరితగతంగా అందేలా చూడాలన్నారు. 
 
ఇటీవల రాష్ట్రంలో చదువుల ఒత్తిళ్ల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. వాటికి అడ్డుకట్టవేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రతి విద్యార్థీ చదువును ఆస్వాదిస్తూ, విద్య సాగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తక్షణమే 13 జిల్లాల కలెక్టర్లు తమ జిల్లాల పరిధిలో ఉన్న కళాశాలలు, ఇతర విద్యా సంస్థలను తనిఖీ చేయాలన్నారు. మార్కులు, ర్యాంకుల కోసం విద్యార్థులపై ఎటువంటి ఒత్తిళ్లూ తేకూడదని ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలను హెచ్చరించాలని ఆదేశించారు. గ్రీవెన్స్ లకు వస్తున్న వినతులకు సత్వరమే పరిష్కారం చూపాలన్నారు. ఈ విషయం డివిజనల్, మండల స్థాయి అధికారులకు తెలయజేయాలని 13 జిల్లాల కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. 
 
వచ్చే సమావేశంలో గ్రీవెన్స్‌లకు వచ్చే ఆర్జీలపై తీసుకున్న చర్యలపై చర్చిద్దామన్నారు. రాష్ట్రంలో గ్రామాలన్నింటినీ ఓడీఎఫ్ గ్రామాలుగా గుర్తించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నమాతా శిశు మరణాలకు అడ్డుకట్టవేయాలన్నారు. విశాఖపట్నం, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అధికంగా ఉన్న క్రైమ్ రేట్ అదుపునకు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను ఉక్కుపాదంతో అణిచి వేయాలని ఆదేశించారు. క్రైమ్ రేట్‌ను అడ్డుకోడానికి అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. 
 
రాష్ట్రంలో అక్షరాస్యత పెంపుదలకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. మన్యంలో ప్రభుత్వం చేపట్టిన తాగునీటి పథకాలను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తయ్యేలా అన్ని జిల్లాల కలెక్టర్లూ చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో 13 జిల్లాల కలెక్టర్లతో పాటు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు సంజయ్ గుప్తా, ఎస్.ఎస్. రావత్, ఆర్.పి. సిసోడియా, సునీతతో పాటు  రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎం.డి కాంతిలాల్ దండే, ఎస్.సి కార్పొరేషన్ ఎం.డి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.