శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 7 జులై 2015 (19:21 IST)

సెక్షన్ 8పై రాద్దాంతం అక్కర్లేదు... : కేంద్రమంత్రి సుజనా చౌదరి

హైదరాబాద్‌లో సెక్షన్ 8ను అమలు చేసే అంశంపై రాద్దాంతం అక్కర్లేదని, గవర్నర్ ఎపుడు అమలు చేయదలచుకుంటే అపుడు అమలు చేయవచ్చని కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా పట్టుబట్టాల్సిన అవసరం లేదన్నారు. ఎందుకంటే.. సెక్షన్ 8 అనేది విభజన చట్టంలోనే ఉందన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తనపై చేసిన విమర్శలపై సుజనా చౌదరి మంగళవారం స్పందించారు. వ్యాపారవేత్తలు రాజకీయాల్లోకి రాకూడదని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు. వ్యాపారం నీతిగా చేస్తున్నామా? లేదా? అన్నదే ముఖ్యమని స్పష్టం చేశారు.
 
పవన్ అన్న నటుడు చిరంజీవి కూడా ఎంపీయేనని, సినిమా కూడా వ్యాపారమేనన్నారు. ఆయన ఎంపీగా కొనసాగడం లేదా అని ప్రశ్నించారు. ఒకవేళ వ్యాపారవేత్తలు రాజకీయాల్లోకి రాకుండా ఉండాలంటే రాజ్యాంగసవరణ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇకపోతే.. సీమాంధ్ర ఎంపీలు ఎలా పనిచేస్తున్నారో నియోజకవర్గ ప్రజలే నిర్ణయిస్తారన్నారు. వ్యక్తిగా పవన్ మంచి సలహాలు ఇస్తే స్వీకరిస్తామన్నారు. ఇక రాష్ట్ర ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తామని సుజనా చౌదరి చెప్పుకొచ్చారు.