శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 16 సెప్టెంబరు 2019 (16:28 IST)

ఓ మంచి స్నేహితుడిని కోల్పోయా .. చంద్రబాబు :: కోడెల మృతి విచారకరం ... వెంకయ్య

సుదీర్ఘకాలం తనతో రాజకీయ ప్రస్థానం కొనసాగించిన కోడెల శివప్రసాదరావు మరణవార్త తెలియడంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతికి గురయ్యారు. కోడెల చనిపోయారన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. డాక్టర్ వృత్తి నుంచి టీడీపీలో చేరి అత్యంత ప్రజాదరణ పొందారని, ఆయన మృతి తెలుగుదేశం పార్టీకి, ప్రజలకు తీరని లోటు అని ట్వీట్ చేశారు. 
 
ఈ సందర్భంగా కోడెల కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే, పలువురు నేతలు కూడా తమ సంతాపాన్ని తెలిపుతూ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అలాగే, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా తన సంపాతాన్నివ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశారు. కోడెల మృతి విచారకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేస్తున్నట్టు తెలిపారు.
 
అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సంతాపం తెలిపారు. కోడెల మృతిపట్ల కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఓ ట్వీట్ చేశారు. 
 
టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి స్పందిస్తూ, కోడెల మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. కోడెల లాంటి ధైర్యవంతుడికి ఇలాంటి ముగింపు ఊహించలేదని, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రావడం దారుణమని అన్నారు. 
 
కోడెల శివప్రసాద రావు తీవ్ర ఒత్తిడికి గురయ్యారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కోడెల చనిపోయే వరకూ వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించిందని ఆరోపించారు. ఎవరు తప్పు చేసినా చట్టాలు, కోర్టులు నిర్ణయం తీసుకుంటాయని, ఈ విషయమై ప్రభుత్వ పెద్దలు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.
 
కోడెల శివప్రసాద్ మరణం పార్టీకి తీరని లోటు అని వ్యాఖ్యానించారు. కోడెల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. కోడెల కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉండి తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్న కోడెల శివప్రసాద్ ఎల్లప్పుడూ ప్రజాసేవే పరమావధిగా వ్యవహరించేవారని, టీడీపీని పటిష్టం చేసేందుకు నిర్విరామంగా శ్రమించారని లోకేశ్ కీర్తించారు.
 
నిబద్ధత కలిగిన నేతను కోల్పోయామని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అన్నారు. ఇది వైసీపీ ప్రభుత్వం చేసిన హత్య అని, కోడెలను వెంటాడి, వేధించడం వల్లే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. పలు కేసుల్లో కోడెలకు బెయిల్ వచ్చినా ఆయనపై మళ్లీ కేసులు పెట్టాలని చూశారని, టీడీపీ నేతలను ఎంతో మందిని వెంటాడుతున్నారని ఆరోపించారు. 
 
ఏపీ రాజకీయాల్లో తనకు పరిచయం లేని వారంటూ ఎవరూ లేరని, అందునా కోడెల స్పీకర్‌గా, మంత్రిగా పనిచేయడంతో సాన్నిహిత్యం ఉందని తెలిపారు. కోడెల ఉరివేసుకుని చనిపోయారంటున్నారని, మరి కుటుంబ కలహాలా, లేక రాజకీయ కక్షలా అనేవి తెలియడంలేదని టీ కాంగ్రెస్ నేత వి.హనుమంత రావు ఆవేదన వ్యక్తం చేశారు.
 
వైసీపీ ప్రభుత్వం వేధింపుల వల్లే కోడెల మృతి చెందాడని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు. కోడెల మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ కంటే ఎక్కువగా జగన్ ప్రభుత్వం వేధిస్తోందని కోడెల ఆవేదన చెందారని నక్కా ఆనంద్ బాబు వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో కోడెలది ప్రత్యేక స్థానం అని, ఆయన మృతి పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు.