ఆడబిడ్డలు రోడ్డెక్కే పరిస్థితి తీసుకొచ్చారు : చంద్రబాబు ఆవేదన
ఏనాడూ ఇంటి నుంచి బయటకు రాని ఆడబిడ్డలు, తల్లులను ఇపుడు రేయింబవుళ్లూ రోడ్లపై ఆందోళనలు చేసేలా పరిస్థితులు కల్పించారంటూ వైకాపా ప్రభుత్వంపై టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తంచేశారు.
ఏపీకి మూడు రాజధానులు రావొచ్చంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనపై రాజధాని అమరావతి రైతులు గత మూడు రోజులుగా ఆందోళనలు సాగిస్తున్న విషయం తెల్సిందే. అమరావతిలో పోరాటం చేస్తున్న రైతులకు ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ మేరకు ఆయన వారు ధర్నా నిర్వహిస్తున్న ప్రదేశానికి వెళ్లారు. వారికి మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, అమరావతిలో రైతులు ప్రథమ పౌరులుగా ఉండాలని ఆలోచించామని, అయితే రైతులు భార్యా పిల్లలతో రోడ్డెక్కే పరిస్థితి తీసుకొచ్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ల్యాండ్ పూలింగ్ ప్యాకేజీకి ఒప్పుకుని రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారని, ఎవరు అధికారంలోకి వచ్చినా అభివృద్ధిని కొనసాగించాలని డిమాండ్ చేశారు.
రైతుల త్యాగాలతోనే రాజధాని కడతామని ఆరోజు చెప్పామని, ఇక్కడి భూమిపై వచ్చే ఆదాయంతోనే రాజధాని కట్టొచ్చని ఆయన చెప్పారు. వైసీపీ ఈ విషయాన్ని విస్మరించిందని, అభివృద్ధితో సంపద పెరుగుతుందని చంద్రబాబు తెలిపారు.
ఏనాడూ గడపదాటి బయటికి రాని ఆడపడుచులు ఇవాళ రోడ్డెక్కాల్సిన పరిస్థితులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదో ఒక పనిచేసుసుకునే రైతన్నలు, రైతుకూలీలు అందరూ ఆందోళన బాటపట్టారని వివరించారు. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియలో రైతులు తమ భూములు ఇవ్వడం చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోతుందని ఆశించానని, ఇదొక మహానగరం అవుతుందని భావించానని తెలిపారు.
ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను దేశంలోనే కాదు, అంతర్జాతీయంగానూ చర్చించారని, ఒక్క వివాదం లేకుండా 33 వేల ఎకరాలు సేకరించడం సాధ్యమా అని దీని గురించి ప్రపంచ ప్రఖ్యాత వర్శిటీలు అధ్యయనం చేశాయని వివరించారు. ఇవాళ ల్యాండ్ పూలింగ్ లో భూములిచ్చిన 29 గ్రామాల రైతులందరూ న్యాయం చేయమని అడుగుతున్నారని, వారందరికీ న్యాయం జరగాలని ఆకాంక్షించారు.
ఈ రోజు (డిసెంబరు 23వ తేదీ) ప్రపంచ రైతు దినోత్సవం సందర్భంగా ఇక్కడ రైతులు బాధతో రోడ్డెక్కడం పట్ల బాధపడుతున్నానని చెప్పారు. ఆ రోజు తానిచ్చిన హామీ వ్యక్తిగతంగా ఇవ్వలేదని, ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రిగా ఇచ్చానని, దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ఇప్పటి ప్రభుత్వంపై ఉందన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలతో తమకు సంబంధంలేదని ప్రభుత్వం అంటే అది చట్టవిరుద్ధం అవుతుందని, రాజ్యాంగ వ్యతిరేకమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.