జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ కాదు.. ఛీప్ సెక్రటరీ : సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జవహర్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విటర్)లో పోస్టు చేశారు. 'దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ సీఎస్ కూడా ఇలా దిగజారలేదు. జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ కాదు, చీప్ సెక్రటరీ. ఆయన హయాంలో రాష్ట్రంలోని వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు శానససభలో ఆమోదించిన బడ్జెట్ కేటాయింపులకు విలువ లేకుండా చేశారు. వ్యవసాయం, ఇరిగేషన్, ఆర్అండ్‌బీ, విద్య తదితర కీలక శాఖలకు కేటాయించిన నిధులను ఇష్టారాజ్యంగా మళ్లించే అధికారం మీకెవరిచ్చారు?
జగన్‌కు సీఎస్ గులాంగా మారి చట్టాలను బూటు కాళ్ల కింద నలిపేయడం దుర్మార్గం. సీఎం దోచుకుంటున్న రూ.లక్షల కోట్లకు కౌంటింగ్ ఏజెంట్‌గా ఆయన మారిపోవడం దురదృష్టకరం. భూకుంభకోణం చేసిందీ, లేనిదీ తెదేపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే తేలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖను భూకుంభకోణాలకు అడ్డాగా మార్చేశారు. ప్రజల పాలిట పెనుశాపమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ఒక సీఎస్‌గా ఎలా అంగీకరిస్తారు? ఎవరూ అడగని రీసర్వేను రైతులపై బలవంతంగా ఎలా రుద్దుతారు? తాతలు, తండ్రులు ఇచ్చిన పొలాల్లో వైఎస్‌ఆర్ జగనన్న భూరక్ష పేరుతో రాళ్లు ఎలా నాటుతారు. ముత్తాతలు ఇచ్చిన ఆస్తుల పత్రాలపై రోజూ జగన్ ఫొటోలు చూసుకోవాలా? రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ హింస జరుగుతుంటే సీఎస్‌గా అదుపు చేయడంలో విఫలమై కన్ఫర్డ్ ఐఏఎస్‌ల ఫైల్‌పై అంత తొందరెందుకు?' అని సోమిరెడ్డి ప్రశ్నించారు.