శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 1 జూన్ 2019 (15:58 IST)

ఆ నవ రత్నాలతో సైకిల్‌ను తుక్కుతుక్కు చేసిన జగన్...

ఎన్నికల హామీలంటే పదుల సంఖ్యలో హామీలు... పెద్ద బుక్‌లెట్‌లు. ఈ సంస్కృతికి తెరదించి కొత్త ఎన్నికల ప్రణాళికతో ఓటర్ల మనస్సు గెలిచారు జగన్. తొమ్మిదంటే తొమ్మిది జనాకర్షక హామీలను జనంలోకి తీసుకెళ్ళారు. నవరత్నాలతో నవ్యాంధ్ర పీఠాన్ని దక్కించుకున్నారు.
 
అధికారంలోకి వస్తే తాము ఏం చేస్తామో చెప్పేందుకు ప్రతి పార్టీ ఎన్నికల ప్రణాళికలు విడుదల చేస్తోంది. రాజకీయ పార్టీలు సాధారణంగా ఎన్నికలకు కొన్నిరోజుల ముదు మ్యానిఫెస్టోలను విడుదల చేస్తూ ఉంటాయి. రాష్ట్రంలో సంచలన విజయాన్ని కైవసం చేసుకున్న వైకాపా మాత్రం ఓ రకంగా రెండేళ్ళ ముందే ఎన్నికల మేనిఫెస్టోను అనధికారికంగా విడుదల చేసింది.
 
వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్న పథకాలను అధ్యయనం చేసిన జగన్ వాటికి తన ఆలోచనను జోడించి నవరత్నాలకు రూపకల్పన చేశారు. 2017 జులైలో అమరావతి వేదికగా జరిగిన పార్టీ ప్లీనరీలోనే వాటిని బహిరంగంగా ప్రకటించారు. ఆ నవరత్నాలే హోరాహోరీగా సాగుతుందనుకున్న ఎన్నికల సమరాన్ని జగన్ పక్షాన మార్చాయని చెప్పుకోవాలి. అభ్యర్థులు కూడా గుర్తించుకోలేని హామీలు కాకుండా తొమ్మిదంటే తొమ్మిది హామీలను నవరత్నాల్లో పొందుపరిచారు జగన్.
 
ముద్రిస్తే అవి నాలుగు పేజీలకు మించలేదు. వాటికే విస్తృత ప్రచారం కల్పించారు. పాదయాత్ర పొడవునా నవరత్నాల గురించి వల్లవేస్తూ జనం నోళ్ళలో నానేలా చేశారు. ప్రధానంగా మహిళలకు, రైతులకు ఇచ్చిన హామీలు బాగా జనంలోకి వెళ్ళాయి. వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వృద్ధాప్య పెన్షన్, విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్, అమ్మబడి ఇలా ఇచ్చిన హామీలు ప్రజల్లోకి బాగా వెళ్లాయి. 
 
డ్వాక్రా సంఘాల రుణాలను మాఫీ చేస్తానని, దశలవారీగా మద్యపాన నిషేధం... ఇలా ముందుకెళ్ళారు. నవరత్నాలతో జనం దగ్గరకు చేరువై ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు జగన్మోహన్ రెడ్డి.