సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 25 జనవరి 2022 (12:03 IST)

జైలు సూపరింటెండెంట్ ఇంట్లో పనిమనిషి... దొంగ‌త‌నం చేసింద‌ని...

ఆంధ్ర ప్ర‌దేశ్లో రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువయ్యింద‌ని, రాష్ట్రం అక్రమ నిర్బంధాలకు, హౌస్ అరెస్టులకు, తప్పుడు కేసులకు, అర్ధరాత్రి అరెస్టులకు, కస్టోడియల్ వేధింపులకు, చిత్రహింసలకు కేంద్రంగా మారింద‌ని తెలుగు మ‌హిళ నాయ‌కురాలు విమ‌ర్శించారు. చిత్తూరు దళిత మహిళ ఉమామహేశ్వరిని పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై విచారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మహిళా కమిషన్ కు టీడీపీ మహిళా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే, వంగలపూడి అనిత లేఖ రాశారు. 
 
 
తాజాగా ఉమామహేశ్వరి అనే దళిత మహిళపై చిత్తూరు పట్టణ పోలీసుల కస్టోడియల్ వేధింపులే ఇందుకు నిదర్శనం అన్నారు. చేయని దొంగతనాన్ని ఆమెపై వేసి, రెండు రోజులపాటు స్టేషన్‌కు పిలిపించి చిత్రహింసలకు గురిచేశార‌ని ఆరోపించారు. ఉమామహేశ్వరి చిత్తూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తోంద‌ని, వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో రూ. 2 లక్షలు పోయాయని, చేయని దొంగతనాన్ని అంగీకరించమని దళిత మహిళ ఉమామహేశ్వరిని పోలీసులు చిత్రహింసలకు గురిచేశార‌న్నారు. తర్వాత ఆ డబ్బు వేణుగోపాల్ రెడ్డికి తెలిసినవారే తీసుకున్నట్లు తెలిసింద‌ని, ఆ విషయం తెలిసి కూడా ఉమామహేశ్వరిని పోలీస్ స్టేషన్‌లో హింసించార‌ని ఆరోపించారు. 
 
 
పోలీసులు మానవ హక్కుల సూత్రాలను పూర్తిగా విస్మరించార‌ని, అరెస్టులు, కస్టడీయల్ చిత్రహింసలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులను కూడా పూర్తిగా విస్మరించార‌న్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాన‌ని వంగ‌ల‌పూడి అనిత పేర్కొన్నారు.