కనగరాజ్‌కు క్వారంటైన్ అక్కర్లేదా సీఎం జగన్ గారూ : ఆలపాటి రాజేంద్రప్రసాద్
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టాలంటే ఖచ్చితంగా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనటూ అధికార వైకాపా నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబును క్వారంటైన్‌లో ఉంచాలంటున్న వైకాపా నేతలకు ఆయన సూటిగా ఓ ప్రశ్న వేశారు.
దొంగచాటుగా రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమితులైన రిటైర్డ్ జడ్జి కనగరాజ్ పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నుంచి వచ్చారనీ, మరి ఆయన్ను క్వారంటైన్‌లో ఉంచనక్కర్లేదా అని నిలదీశారు.
ఇదే అంశంపై ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, ఎస్ఈసీగా నియమితులైన మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి, చెన్నై నుంచి వచ్చారనే విషయాన్ని వైకాపా నేతలు మరచిపోయినట్టున్నారని గుర్తుచేశారు. ఆయన్ను ఎందుకు క్వారంటైన్ చేయలేదని ప్రశ్నించారు.
న్యాయస్థానాలు పదేపదే మొట్టికాయలు వేస్తున్నప్పటికీ, సీఎం జగన్ సర్కారు పట్టించుకోకుండా ముందుకు వెళుతోందని ఆలపాటి విమర్శలు గుప్పించారు. స్థానిక ఎన్నికల్లో గెలవాలన్న ఉద్దేశంతో గ్రామ, వార్డు వాలంటీర్లతో ప్రచారం సాగిస్తున్నారని ఆరోపించారు. ప్రపంచం మొత్తం కరోనా వైరస్ దెబ్బకు వణికిపోతుంటే.. జగన్‌కు మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి, అమరావతిని చంపెయ్యాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని ఆరోపించారు.