శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 నవంబరు 2019 (12:57 IST)

తెదేపాను వీడాలంటూ ఒత్తిడి.. అందుకే మా బస్సులు సీజ్ : జేసీ దివాకర్

తెలుగుదేశం పార్టీని విడి, వైకాపాలో చేరేలా తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారనీ, ఇందులోభాగంగా, తమ బస్సులు సీజ్ చేశారంటూ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన గురువారం మాట్లాడుతూ, మనుషులను, సంస్థలను లక్ష్యంగా చేసుకుని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. అన్నివైపుల నుంచి ఒత్తిడులు పెంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేలా చేయడమే ఈ కేసుల ప్రధాన ఉద్దేశంగా ఉందన్నారు. 
 
భవిష్యత్తులో ఇది మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందన్నారు. జేసీ ట్రావెల్స్‌కు చెందిన బస్సులు సీజ్‌ చేయడం కూడా ఇందులో భాగమేనని ఆయన చెప్పుకొచ్చారు. 
 
దశాబ్దాలుగా రవాణా వ్యాపారంలో తాను ఉన్నానని, నిబంధనలు అతిక్రమించిన సందర్భాలు ఎప్పుడూ లేవని అన్నారు. అయినా మా బస్సులు సీజ్‌ చేస్తున్నారంటే లక్ష్యం మేరకేనన్నారు. లేదంటే మిగిలిన సంస్థల బస్సులు ఎన్ని సీజ్‌ చేశారని చెప్పారు. 
 
ట్రిబ్యునల్‌ బస్సులను విడుదల చేయాలని చెప్పినా రవాణా శాఖ అధికారులు వదలడం లేదన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వంటి ఉన్నత స్థాయి అధికారిపైనే వేటు వేసిన ప్రభుత్వం తమనేం చేస్తుందో అన్న భయం అధికారుల్లో ఉందని, అందుకే వారు ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదన్నారు.