మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 27 సెప్టెంబరు 2018 (14:16 IST)

తమ్ముడూ.. నా రెండో వైపు చూస్తే తట్టుకోలేవు : పవన్‌కు చింతమనేని వార్నింగ్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. తమ్ముడూ.. నా రెండోవైపు చూస్తే తట్టుకోలేవంటూ హెచ్చరించారు.

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. తమ్ముడూ.. నా రెండోవైపు చూస్తే తట్టుకోలేవంటూ హెచ్చరించారు. అలాగే, తనపై పవన్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించిన పవన్... రౌడీలపై స్టింగ్ ఆపరేషన్ ఎందుకు చేయరంటూ పరోక్షంగా ఎమ్మెల్యే చింతమనేని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీంతో చింతమనేని మీడియా సమావేశం ఏర్పాటు చేసి పవన్‌ను ఏకిపారేశారు.
 
ఒకవేళ తనపై ఆరోపణలను నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలను వదిలి వెళ్లిపోతానని చెప్పారు. ఒక పార్టీ అధినేతవి అయి ఉండి బజారు మనిషిలా నాపై ఆరోపణలు చేశావని చింతమనేని పవన్‌ను విమర్శించారు. ఓసారి 30 కేసులున్నాయని, మరోసారి 27 కేసులు ఉన్నాయని.. ఎవరో రాసిస్తే చదవడం కాదని పవన్ కల్యాణ్‌‌కు సూచించారు. తనపై ఉన్నవి కేవలం మూడే కేసులే అని.. అవి కూడా ప్రజాక్షేత్రంలో పోరాడే క్రమంలో నమోదైనవే అని చెప్పారు. నిరాధారిత ఆరోపణలు చేయడం తగదని.. ఏకపాత్రాభినయం చేస్తూ గంట సమయం తనను విమర్శించడానికే వెచ్చించడం దారుణమని అన్నారు. 
 
పవన్ తనకు ఇష్టమైన వ్యక్తులతో కమిటీ నియమించుకోవాలనీ, నెల రోజుల తర్వాత తనతో బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. తనను వీధి రౌడీ, ఆకు రౌడీ అని పవన్ సంబోధిస్తున్నారనీ, ఆ పేర్లను రిజస్టర్ చేసుకుంటే ఆయన సినిమాలకు సరిగ్గా సరిపోతాయని ఎద్దేవా చేశారు. నిజంగా తాను చేసిన తప్పుల గురించి చెబితే సరిదిద్దుకుంటాననీ, సానుకూల విమర్శలు చేస్తే స్వాగతిస్తానని అన్నారు. తొలుత దెందులూరు ప్రజలు, ఆ తర్వాత రాష్ట్ర ప్రజలు, చివరికి పార్టీ అధినేత చంద్రబాబు తనకు హైకమాండ్ అని చింతమనేని స్పష్టం చేశారు