మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 1 జూన్ 2020 (09:43 IST)

వైసీపీలో చేరికపై తేల్చేసిన టీడీపీ ఎమ్మెల్యే!

ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు టీడీపీకి టాటా చెప్పేసి వైసీపీ గూటికి చేరుతున్నట్లు గత కొన్నిరోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అంతేకాదు ఇటీవలే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో సమావేశమై చేరికపై మాట్లాడారని కూడా వార్తలు వచ్చాయి.

ఈ వ్యవహారంపై నాడు పార్టీ ముఖ్య కార్యకర్తలు, అనుచరులు, అభిమానులతో సమావేశమై నిశితంగా చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్టీని వీడటంపై తేల్చేశారు. టీడీపీని వీడతానంటూ జరిగిన ప్రచారాన్ని సాంబశివరావు తీవ్రంగా ఖండించారు. కొందరు కావాలనే పనికట్టుకుని తనపై దుష్ప్రచారం చేశారని వెల్లడించారు.

‘నాకు తెలుగు దేశం పార్టీని వీడే ఆలోచన లేదు. నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తులతో సంప్రదింపులు జరపలేదు. నాకు రాజకీయ భవిష్యత్తును ఇచ్చింది తెలుగుదేశం పార్టీనే. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి పర్చూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశాను.

నియోజకవర్గ ప్రజలు కూడా రాజకీయ నేతగా కన్నా తమ కుటుంబ సభ్యునిగానే చూశారు. గత ప్రభుత్వ హయాంలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను కూడా పరిష్కరించగలిగాం' అన్నారు.