గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 మార్చి 2022 (13:15 IST)

పెగాసెస్‌పై వివాదం : స్పీకర్‌కు లేఖ రాసిన టీడీపీ సభ్యులు

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఇపుడు సంచలనంగా మారాయి. ఇజ్రాయేల్‌కు చెందిన పెగాసెస్ స్పై వేర్‌ను చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారంటూ చేసిన వ్యాఖ్యలు ఇపుడు రాష్ట్ర రాజకీయాల్లో వేడిపుట్టిస్తున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే టీడీపీ, వైకాపాల మధ్య మాటల యుద్ధం తారా స్థాయిలో సాగుతోంది. 
 
ఈ నేపథ్యంలో చంద్రబాబు పెగాసెస్ స్పై వేర్‌ను వినియోగించారన్న మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై అసెంబ్లీ దద్ధరిల్లిపోయింది. అయితే, పెగాసెస్‌పై చర్చకు నోటీసు ఇవ్వాలంటూ అధికార పార్టీ సభ్యులకు స్పీకర్ తమ్మినేని సీతారాం సూచించారు. దీనికి అధికార పార్టీ సభ్యులు స్పందిస్తూ, ఇప్పటికే నోటీసు ఇచ్చినట్టు ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. దీంతో ప్రశ్నోత్తరాల అనంతరం పెగాసెస్‌పై చర్చకు స్పీకర్ అనుమతించారు. 
 
మరోవైపు, ఈ వ్యవహారంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీడీపీ సభ్యులు స్పీకర్ తమ్మినేని సీతారాంకు నోటీసు ఇచ్చారు. ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున అసెంబ్లీలో చర్చించడం సరికాదంటూ తమ్మినేనికి రాసిన లేఖలో పేర్కొన్నారు. పెగాసెస్ స్పై వేర్‌ను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయలేదని మాజీ డీజీపీ గౌతం సవాంగ్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ సభ్యులు ఈ సందర్భంగా గుర్తుచేశారు.