రాజ్యసభకు వెళ్లకుంటే విశ్రాంతి తీసుకుంటా : యనమల రామకృష్ణుడు
తెలుగుదేశం పార్టీ ఆవిర్భాం నుంచి సేవలు అందించిన వారిలో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఒకరు. మంత్రిగాను ఆయన విశేష సేవలు అందించారు. ప్రస్తుతం శాసనమండలి సభ్యుడుగా కొనసాగుతున్నారు. ఈ నెలాఖరుతో ఆయన పదవీకాలం పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ గురించి ఆయన తాజాగా తన మనసులోని మాటను వెల్లడించారు. పార్టీ అవకాశమిస్తే రాజ్యసభకు వెళతానని లేదంటే ఇంటిపట్టున ఉంటూ హాయిగా విశ్రాంతి తీసుకుంటానని చెప్పారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించిన రోజు సీఎం చంద్రబాబు తనతో మాట్లాడారని, ఫలానా వారిని ఎంపిక చేశామని చెబితే స్వాగతించానని చెప్పారు. రెండుసార్లు తనను శాసనమండలి సభ్యుడుగా అవకాశం కల్పించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పినట్టు పేర్కొన్నారు. రాజకీయాలు ఇపుడు ఖరీదైనవిగా మారిపోయాయని, ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదని యనమల అభిప్రాయపడ్డారు.