శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2020 (13:54 IST)

విశాఖలో తెదేపాకు షాక్ : గోడదూకనున్న మాజీ ఎమ్మెల్యే పంచకర్ల

తెలుగుదేశం పార్టీకి విశాఖపట్టణం జిల్లాలో గట్టి షాక్ తగలనుంది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అధికార వైకాపాలో చేరనున్నారు. ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారు. 
 
విశాఖపట్టణాన్ని రాజధానిగా టీడీపీ వ్యతిరేకించడాన్ని నిరసిస్తూ కొన్ని నెలల క్రితమే తెలుగుదేశానికి ఆయన రాజీనామా చేశారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా పంచకర్ల రమేష్ బాబు వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. 
 
కాగా, ఇదే జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు కూడా వైకాపాలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. నిజానికి ఈయన ఆగస్టు 16వ తేదీనే వైకాపాలో చేరాల్సివుంది. 
 
కానీ, ఆ పార్టీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు.. విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్‌లు గంటా రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో గంటా అయోమయంలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వైకాపాలో చేరనుండటం గమనార్హం.