మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 23 జూన్ 2019 (17:18 IST)

హైదరాబాద్ నగరంలో ఎకరా స్థలం కేవలం ఒక్క రూపాయి మాత్రమే...

హైదరాబాద్ నగరంలో గజం స్థలం రూ.కోట్లలో ఉంటుంది. కానీ, పాలకులు తలచుకుంటే ఈ కోట్ల రూపాయల ధరను కేవలం ఒక్క రూపాయిగా కూడా మార్చివేయగలరు. మార్చివేయడం కాదు.. నిజంగానే చేసి చూపించారు. హైదరాబాద్ నగరంలో ఎకరం స్థలం రూ.1కే తెలంగాణ ప్రభుత్వం విక్రయించింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, విశాఖపట్టణానికి చెందిన శారదా పీఠానికి తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో రెండెకరాల స్థలాన్ని కేటాయించింది. పీఠం ఆధ్వర్యంలో ఆలయం, వేదభాష గోష్టిమఠం, సంస్కృత విద్యా సంస్థల ఏర్పాటు, విద్యార్థులకు వసతి గృహం, కన్వెన్షన్ సెంటర్ తదితర నిర్మాణాలను చేపట్టనున్నారు. ఇందుకోసం అవసరమైన రెండు ఎకరాల స్థలాన్ని తెలంగాణ సర్కారు కేటాయించింది. 
 
ఈ స్థలాన్ని రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట గ్రామ సర్వే నంబరు 240లో ఉన్న భూమిని కేటాయిస్తూ శనివారం తెలంగాణ ప్రభుత్వం జీవో నంబరును 71ని జారీచేశారు. కాగా, నిజానికి పీఠం ధర్మాధికారి జి కామేశ్వరమ్మ 2015, 2018లో భూమి కోసం దరఖాస్తు చేయగా, దీనిపై సానుకూల స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో శారదా పీఠం మరోమారు విజ్ఞప్తి చేయడం, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ భూమిని కేటాయించారు.