శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

బురెడ్డిపల్లి సమీపంలో అర్థరాత్రి సమయంలో అగ్నికి ఆహుతైన ఏపీఎస్ ఆర్టీసీ బస్సు!!

apsrtc
తెలంగాణ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఒకటి అగ్నికి ఆహుతైంది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళుతున్న ఈ బస్సు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం బురెడ్డిపల్లి సమీపంలో మంటల్లో కాలిపోయింది. బస్సు, డీసీఎం వ్యాను ఒకదానికొకటి ఢీకొనడంతో బస్సులో మంటలు అంటుకుని ఆ తర్వాత కాసేపటికే దగ్ధమైంది. అదృష్టవశాత్తూ బస్సులోని ప్రయాణికులందరూ గాయాలతో బయటపడ్డారు. ఆదివారం రాత్రి 1.45 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. 
 
ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ లగ్జరీ బస్సు రాత్రి 12 గంటలకు హైదరాబాద్‌లోని ఎంబీబీఎస్ నుంచి ప్రయాణికులతో బయలుదేరింది. బురెడ్డిపల్లి మలుపు వద్ద డీసీఎం వాహనం యూటర్న్ తీసుకునేందుకు ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఈ క్రమంలో బస్సు, డీసీఎం ఢీకొన్నాయి. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు అద్దాలు పగలగొట్టుకుని బయటకు దూకేసి ప్రాణాలు కాపాడుకున్నారు. 
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రయాణికులు బయటకు వచ్చిన కాసేపటికే బస్సులో మంటలు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చే సరికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. క్షతగాత్రులను మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో హైదరాబాద్, అనంతపురం జిల్లాల వారు ఉన్నారు. గాయపడిన 15 మంది ప్రయాణికుల పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.