శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 27 అక్టోబరు 2016 (09:12 IST)

నయీంతో లింకులు : తెలంగాణ మండలి డిప్యూటీ ఛైర్మన్‌ నేతి విద్యాసాగర్‌పై వేటు?

గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసులో రాజకీయంగా తొలి వికెట్‌ పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైన నయీంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న అభియోగాలు ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్ర శ

గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసులో రాజకీయంగా తొలి వికెట్‌ పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైన నయీంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న అభియోగాలు ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ను ఆ పదవి నుంచి తప్పించటానికి రంగం సిద్ధమైంది. ఈ దిశగా అధికార తెరాస పార్టీ అధిష్టానం, సీఎం కేసీఆర్‌లు కసరత్తు చేస్తున్నారు. దీంతో వచ్చే అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలనాటికి మండలి డిప్యూటీ ఛైర్మన్‌ను మార్చటం ఖాయమని తెలుస్తోంది. 
 
నల్గొండ జిల్లా నకిరేకల్‌ ప్రాంతానికి చెందిన నేతి విద్యాసాగర్‌ ప్రస్తుతం రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు. సుమారు నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన ఈయన.. కాంగ్రెస్ పార్టీ నుంచి తెరాసలోకి చేరారు. 2009లో రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. 
 
ఈయనకు గ్యాంగ్‌స్టర్‌ నయీంతో విద్యాసాగర్‌కు సన్నిహిత సంబంధాలున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. నయీం కేసులో అరెస్టు అయిన నిందితులు తమ వాంగ్మూలంలో ఆ విషయాన్ని ధ్రువీకరించారు. తొలి నుంచి నయీం కేసు విషయంలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధపెట్టారు. నయీంతో సంబంధం కలిగిన వారిని వదిలిపెట్టేదిలేదని, అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని సంకేతాలిచ్చారు. 
 
ఈనేపథ్యంలో విద్యాసాగర్‌కు నయీంతో సంబంధాలు ఉన్నాయనే అభియోగాలు రావటాన్ని కేసీఆర్‌ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువచ్చే ప్రమాదం ఉందని, నయీంతో సంబంధం ఉన్న విపక్ష నేతలపై చర్యలు తీసుకోవాలంటే ముందుగా తమ పార్టీనుంచి అభియోగాలు ఎదుర్కొంటున్న విద్యాసాగర్‌పై వేటు వేయాలని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు భావిస్తున్నట్లు సమాచారం.