మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 ఆగస్టు 2021 (12:24 IST)

సీఎం జగన్‌కు గుడి కట్టిన వైకాపా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే

వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆ పార్టీకి చెందిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అంతులేని ప్రేమ చూపించారు. సీఎం జగన్ అమలు చేస్తున్న నవరత్నాలు పేరిట దేవాలయాన్ని నిర్మించారు. 
 
రైతు భరోసా, పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి పేరుతో భారీ స్తూపాలు నిర్మించారు. పేదలకు ఇళ్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం పథకాల పేరుతో స్థూపాలను నిర్మించారు.
 
మరోవైపు నవరత్నాల సృష్టికర్త అంటూ ఏపీ సీఎం జగన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సుమారు రూ.2 కోట్ల ఖర్చుతో ఈ దేవాలయాన్ని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నిర్మించినట్టు తెలుస్తోంది. 
 
ముఖ్యంగా, సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దేశంలో మరెక్కడా లేని పథకాలను అమలు చేస్తున్నారని, వైసీపీ ప్రభుత్వంలో ఏపీ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి కొనియాడారు. 
 
కాగా గతంలోనూ ప.గో. జిల్లా గోపాలపురం మండలం రాజంపాలెంలో సీఎం జగన్‌కు గుడి కట్టేందుకు ఎమ్మెల్యే తలారి వెంకట్రావు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.