ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 17 మార్చి 2020 (07:28 IST)

సార్వత్రిక ఎన్నికల్లో మరింత పేట్రేగుతారు: పవన్

స్థానిక సంస్థలకు చేపట్టిన ఎన్నికల నామినేషన్ల దశలో చెలరేగిన హింస, దౌర్జన్యాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయి అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. అభ్యర్థులతో నామినేషన్లు దాఖలు చేయించే సమయంలో దాడులు చేయడం, వాటిని ఎదుర్కొని నామినేషన్ ఇచ్చినా బలవంతంగా ఉపసంహరింప చేయడం దురదృష్టకరం అని చెప్పారు.

తమ బాధ్యతలు విస్మరించి అధికార పార్టీ చెప్పుచేతల్లో అధికార యంత్రాంగం పని చేయడం సమాజానికి హాని చేస్తుంది అన్నారు. నిజాయతీ నిబద్ధత కలిగిన అధికారులు కొందరు ఈ పరిస్థితులను మౌనంగా భరిస్తున్నారు... వీటిని చేదించాల్సిన సమయం వచ్చిందన్నారు. స్థానిక ఎన్నికల్లో చోటుచేసుకొన్న ఈ హింస, దౌర్జన్యాలపై ఏ మాత్రం మౌనంగా ఉండకూడదని ఆయ‌న పిలుపునిచ్చారు.

అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇంచార్జులు, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, ముఖ్య నేతలతో పవన్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్యాన్ని అధికార పార్టీ ఖూనీ చేసిన తీరుపై కేంద్ర హోమ్ శాఖకు, కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేస్తున్నామన్నారు.

ఈ సంద‌ర్భంగా పవన్ కల్యాణ్  నాయకులకు దిశానిర్దేశం చేస్తూ “స్థానిక ఎన్నికల్లో మనల్ని అడ్డుకొని దౌర్జన్యాలు చేస్తే మౌనంగా ఉంటే సార్వత్రిక ఎన్నికల సమయంలో మరింత పేట్రేగిపోతారు. కాబట్టి ధైర్యంగా నిలబడదాం. మీ పరిధిలో నామినేషన్ వేసేందుకు ఎదురైన ఇబ్బందులను, ఎదుర్కొన్న దాడులను వివరంగా తెలియచేయండి. పలు చోట్ల మన అభ్యర్థులపై దాడికి దిగడం, నామినేషన్ వేశాక బలవంతంగా విత్ డ్రా చేయించడం లాంటివి నా దృష్టికి వచ్చాయి.

రాయలసీమలో మన పార్టీ పి.ఏ.సి. సభ్యులు డా.హరిప్రసాద్,  మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యపై దాడి చేశారు. అలాగే మన కూటమిలో భాగమైన బి.జె.పి. అభ్యర్థి మనెమ్మపై కత్తితో దాడి చేస్తే చేతికి బలమైన గాయమైంది. ఈ విధమైన హింస, దౌర్జన్యాలపై నామినేషన్ దశలోనే బిజేపీతో కలిసి మీడియా ముందు ఖండించాను. బీజేపీ ముఖ్య నాయకులతో కూడా ఈ దౌర్జన్యాలపై చర్చించాను.

మన అభ్యర్థులు, నాయకులపై దాడులు చేస్తుంటే రక్షించాల్సిన పోలీసులు, నామినేషన్ దశలో ఇబ్బందులు పాల్జేసి అడ్డుకొన్న అధికారుల వివరాలు కూడా సమగ్రంగా తెలియచేయండి. తమ బాధ్యతలను నిర్వర్తించని ప్రతి అధికారినీ, ఉద్యోగినీ జవాబుదారీ చేయాలి.

స్థానిక ఎన్నికల్లో చోటు చేసుకున్న హింస, దౌర్జన్యాలు సంఘటనల వారీగా, మీపై దాడులు చేసి ఇబ్బందిపెడుతున్నా రక్షించని అధికారులు, నామినేషన్ దశలో ఆర్.ఓ.ల వ్యవహార శైలిపై  వివరాలు పార్టీ కేంద్ర కార్యాలయానికి సత్వరమే పంపించండి. వీటిని క్రోడీకరించి స్వయంగా కేంద్ర హోమ్ శాఖకు అందచేస్తాను. అలాగే కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వెళ్తాను అన్నారు. 
 
జనసేన కార్యకర్త కుటుంబానికి రూ.లక్ష సాయం..
ఎన్నికల ప్రచారంలో ఉండగా జనసేన కార్యకర్త యక్కల అర్జునరావు గుండెపోటుతో మృతి చెందడంపై పవన్ కల్యాణ్ సానుభూతి వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలంలో జనసేన జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో ఉండగా అర్జునరావు మృతి చెందారు. ఆయన కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నట్లు పవన్ ప్రకటించారు. 
 
ఏకగ్రీవంగా ఎన్నికైనవారికి అభినందనలు..
ఎంపీటీసీ స్థానాలలో జనసేన పక్షాన నిలిచి ఏకగ్రీవంగా ఎన్నికైన వారిని పవన్ కల్యాణ్ అభినందించారు. గుండబొమ్మ భూలక్ష్మి (జొన్నలగడ్డ-2, గుంటూరు జిల్లా), యర్రంశెట్టి వెంకట నరసింహారావు, వేడంగి, ప.గో.జిల్లా), నూని విజయనిర్మల కడియపులంక -3, తూ.గో.జిల్లా), మేడిచర్ల వెంకట సత్యవాణి (రామరాజు లంక, రాజోలు నియోజకవర్గం, తూ.గో.జిల్లా) ఏకగ్రీవంగా గెలిచారు. వీరిని పవన్ అభినందించారు.