శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 3 ఆగస్టు 2019 (19:47 IST)

రాజ్ భవన్ లో వైభవంగా గవర్నర్ జన్మదిన వేడుకలు

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ హోదాలో బిశ్వభూషన్ హరిచందన్ తన 85వ జన్మదిన వేడుకలను ప్రత్యేకరీతిన జరుపుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న నేపధ్యంలో ప్రభుత్వం తరుపున రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు, రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, స్ధానిక శాసన సభ్యుడు మల్లాది విష్ణు తదితరులు రాజ్ భవన్ కు వచ్చి గవర్నర్ కు జన్మదిన శుభాకాంక్షలు అందించారు.

ఆంధ్రప్రదేశ్ డిజిపి గౌతమ్ సవాంగ్, విజయవాడ పోలీస్ కమీషనర్ ద్వారకా తిరుమల రావు, అడిషినల్ డిజి లా అండ్ ఆర్డర్  రవి శంకర్ అయ్యన్నార్ , రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కష్ణ బాబు, రెడ్ క్రాస్ బాధ్యుడు బాలసుబ్రమణ్యం తదితరులు గవర్నర్ కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.

చిన్నారులు గులాబీలు చేతబూని  గవర్నర్ కు శుభాకాంక్షలు అందించేందుకు బారులు తీరగా, గవర్నర్ దంపతులు ఓపికగా వారిలో ఫోటోలు దిగుతూ ప్రోత్సహించారు. గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా గవర్నర్ దంపతుల చిత్రపటాన్ని జన్మదిన కానుకగా బహుకరించారు. ఎనభై ఐదు వసంతాలను పూర్తి చేసుకుని 86వ వసంతంలోకి అడుగుపెట్టిన గవర్నర్ పుట్టిన రోజు నేపధ్యంలో పలు ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టారు.

చిన్నారుల సమక్షంలో రాష్ట్ర ప్రధమ పౌరుడు వేడుకలు జరుపుకోగా, ఉదయం తిరుమల తిరుపతి దేవస్ధానం, కనకదుర్గమ్మ దేవస్ధానం వేదపండితులు గవర్నర్ కు ఆశీర్వచనం అందించారు. తదుపరి గిరిజన, దళిత చిన్నారులకు గవర్నర్ నూతన వస్త్రాలు, పుస్తకాలు బహుకరించారు. చిన్నారులకు నూతన వస్త్రాల విషయంలోనూ రాజ్ భవన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. చిన్నారుల వద్దకే దర్జిని పంపి వారి కొలతలు తీసుకుని ప్రత్యేకంగా తయారు చేయించారు. 

కల్చరల్ విభాగం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఔన్నత్యాన్ని పెంపొందించే కూచిపూడి ప్రదర్శనతో సహా పలు కార్యక్రమాలు జరిగాయి. జన్మదిన వేడుకల నేపధ్యంలో ముందుగా అనుమతి తీసుకున్న ఆహ్వానితులతో గవర్నర్ భేటీ అయ్యారు. సాయంత్రం గవర్నర్ ను కలిసిన వారిలో  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఎల్వీ సుబ్రమణ్యం, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర బాధ్యులు  కన్నా లక్ష్మి నారాయణ,  వివిధ పార్టీల నేతలు, స్వచ్ఛంధ సంస్ధల ప్రతినిధులు ఉన్నారు.

జిల్లా కలెక్టర్  ఇంతియాజ్ అహ్మద్, జాయింట్ కలెక్టర్ మాధవిలత , రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి అర్జునరావు తదితరులు కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాజ్ భవన్ కు చెందిన వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది గవర్నర్ తో ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపగా ప్రోటోకాల్ ను పక్కన పెట్టి వారికి విశ్వభూషన్ అవకాశం కల్పించారు. మీడియా వారితో సైతం ఫోటోలు దిగుతూ ప్రత్యేకతను చాటుకున్నారు.